ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే దిశగా భారత ఎన్నికల సంఘం కీలక అడుగులు వేసింది

national |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 05:57 PM

దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే దిశగా భారత ఎన్నికల సంఘం  కీలక అడుగులు వేసింది. ఓటర్ల జాబితా కచ్చితత్వాన్ని పెంచడం, ఓటర్లకు అందించే సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా మూడు ప్రధాన సంస్కరణలను ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిల నేతృత్వంలో మార్చిలో జరిగిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల  సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఈసీఐ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.ఓటర్ల జాబితాలో తరచూ తలెత్తే సమస్యల్లో ఒకటైన మరణించిన వారి పేర్లను సమర్థవంతంగా తొలగించేందుకు ఈసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద నమోదైన మరణాల వివరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నేరుగా సేకరిస్తారు. ఈ సమాచారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు  అందుతుంది. అనంతరం బూత్ లెవల్ అధికారులు  క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆ వివరాలను ధృవీకరించుకుంటారు. దీనివల్ల, ఫారం 7 ద్వారా అధికారికంగా దరఖాస్తు అందే వరకు వేచి చూడకుండానే, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి సత్వరమే తొలగించడానికి వీలవుతుంది. 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల్లోని రూల్ 9, జనన మరణాల నమోదు చట్టం-1969 2023 సవరణ లోని సెక్షన్ 3(5)(b)లకు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు ఈసీఐ తెలిపింది. ఈ చర్యతో ఓటర్ల జాబితా మరింత కచ్చితంగా మారుతుందని భావిస్తున్నారు.ఓటర్లకు పోలింగ్ కేంద్రం, ఇతర వివరాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఓటర్ సమాచార స్లిప్  ను ఈసీఐ పునఃరూపకల్పన చేసింది. కొత్త స్లిప్పులో ఓటరు సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ వంటి వివరాలను పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు. దీనివల్ల ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్‌ను తేలికగా గుర్తించడంతో పాటు, పోలింగ్ అధికారులు కూడా ఓటర్ల జాబితాలో వారి పేరును వేగంగా కనుగొనడానికి వీలవుతుందని ఈసీఐ పేర్కొంది.ఓటర్లకు, ఎన్నికల సంఘానికి మధ్య వారధిగా పనిచేసే బూత్ లెవల్ అధికారుల (BLO) పనితీరును మరింత మెరుగుపరిచేందుకు, వారికి ప్రజల్లో గుర్తింపు పెంచేందుకు ఈసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 13B(2) కింద నియమితులైన బీఎల్వోలందరికీ ఇకపై ప్రామాణిక ఫోటో గుర్తింపు కార్డులను జారీ చేయాలని ఆదేశించింది. ఇంటింటి సర్వే, ఓటరు నమోదు, పరిశీలన వంటి కార్యక్రమాల సమయంలో బీఎల్వోలను ప్రజలు సులభంగా గుర్తించేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయని, తద్వారా వారి మధ్య విశ్వాసం పెరిగి, ఎన్నికల ప్రక్రియ మరింత సజావుగా సాగుతుందని ఈసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa