జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లభ్యం కావడంతో దాయాదిపై భారత్ దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాక్ విమానాల కోసం భారత గగనతలాన్ని మూసివేసింది. ఆ దేశంతో దిగుమతులను ఆపేసింది. దీంతో పాకిస్థాన్ అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్ ప్రతీకార దాడి తప్పదని, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం పాక్‌ను వెంటాడుతోంది. అలాగే, తాము అణుబాంబులు వేయడానికి వెనుకాడబోమని పాక్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. దీంతో ఇతర దేశాల మద్దతు కోసం పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టర్కీ చెందిన యుద్ధ నౌక కరాచీ తీరానికి చేరడం కలకలం రేపుతోంది. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధికారులతో వరుసగా సమావేశం కావడం ఉత్కంఠ పెంచుతోంది.
ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆర్మీ అధికారులు, ప్రతిపక్ష పార్టీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ (పీటీఐ) ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఉగ్రవాదాన్ని తాము ఖండిస్తున్నామని, ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారని పీటీఐ తెలిపింది. ‘చాలా కాలంగా ఉగ్రవాదాన్ని పీటీఐ ఖండిస్తోంది.. పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ కూడా ఈ విషయంలో తన వైఖరిని పలుమార్లు బహిరంగ సమావేశాల్లోనూ నొక్కి చెప్పారు’ అని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక, పాక్‌కు సాయంగా మిత్ర దేశమైన టర్కీ.. అత్యంత శక్తివంతమైన ‘టీసీజీ బుయుకడా’ అనే యుద్ధ నౌకను కరాచీ తీరానికి పంపినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నౌక జలాంతర్గాములను గుర్తించి దాడి చేయగలదు. ఇది గస్తీలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అరేబియా సముద్రంలో పాకిస్థాన్ నౌకలకు ప్రయాణ మార్గాలను భారత్ ఇప్పటికే మూసివేసింది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చని పాకిస్థాన్ భయపడుతోంది. అందుకే టర్కీ సహాయంతో గస్తీ నౌకను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. మే 4 నుంచి 7 వరకు కరాచీలో ఉండనున్నట్టు సమాచారం.
ఈ యుద్ధనౌక కరాచీ తీరంలో ఉన్నట్టు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్, మీడియా సలహాదారు అడ్మిరల్ జెకీ ఆక్తుర్క్ ధ్రువీకరించారు. కానీ, ఇది లంకావీ అంతర్జాతీయ మారీటైమ్, ఏరోస్పేస్ ప్రదర్శన లో పాల్గొనేందుకు వెళ్తోందని చెప్పారు. అది ప్రయాణించే మార్గంలో ఒమన్, పాకిస్థాన్ పోర్టులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ‘వివిధ ఆపరేషన్లు, మిషన్లతో పాటు టర్కీ సాయుధ దళాలు తమ ఆపరేషనల్ సిద్ధత, సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపరచేందుకు నిరంతరంగా శిక్షణలు, డ్రిల్స్ నిరంతరం జరుగుతున్నాయి’ అని అడ్మిరల్ తన ప్రకటనలో తెలిపారు. ఇస్తాంబులోని తుజ్లా నావెల్ షిప్‌యార్డ్ టీసీజీ బుయకడా నిర్మాణాన్ని 2008 జనవరి 22న ప్రారంభించి.. 2011 సెప్టెంబరు 27కి పూర్తిచేసింది. రెండేళ్ల పరీక్షల అనంతరం 2013 సెప్టెంబరు 27న నౌకాదళం చేరింది.
ఇప్పటికే టర్కీకి చెందిన యుద్ధ విమానాలు కరాచీ విమానాశ్రయంలో దిగినట్టు ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే యుద్ధ నౌక కరాచీ తీరానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక టర్కిష్ సీ-130ఈ హెర్క్యులస్ విమానం కరాచీలో దిగిందని, ఈ విమానంలో పాకిస్థాన్‌కు మిలటరీ సామాగ్రి పంపినట్టు సమాచారం. ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ ట్రాకర్లు ప్రచురించిన విమాన ట్రాకింగ్ డేటా ఆధారంగా ఈ నివేదికలు వెలువడ్డాయి. ఈ విమానం ఏప్రిల్ 28న అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. అయితే, ఈ ప్రచారాన్ని టర్కీ ఖండించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa