మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు ఒకటి. కిడ్నీలు శరీరంలో అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తాయి. రక్తాన్ని క్లీన్ చేయడం, శరీరం నుంచి మలినాలు అంటే టాక్సిన్లు తొలగించడం, అదనపు ద్రవాల్ని ఫిల్టర్ చేయడం లాంటి పనుల్ని కిడ్నీలు నిర్వహిస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సాయపడతాయి.
ఇలా శరీరానికి ఎంతో మేలు చేసే కిడ్నీలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే, వేగంగా మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదముంది. మూత్రపిండాల సంబంధిత సమస్యల్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే కొన్ని సంకేతాల్ని గుర్తించడం చాలా ముఖ్యం. మూత్రపిండాలు డ్యామేజ్ అయినప్పుడు ఉదయం పూట నిద్రలేవగానే శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాల్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స అందిస్తే తీవ్రమైన పరిస్థితుల్ని నివారించవచ్చు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.
కాళ్ళు, ముఖంలో వాపు
ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే కాళ్ళు, ముఖంలో వాపు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. మూత్రపిండాలు శరీరంలో ఉన్న అదనపు నీటిని తొలగించలేనప్పుడు.. అది బాడీలో పేరుకుపోతుంది. దీంతో కాళ్ళలో వాపు, కళ్ల చుట్టూ వాపు కనిపిస్తుంది. ఈ లక్షణం పదే పదే కనిపిస్తే కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. డాక్టర్‌ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
అలసట
సాధారణంగా ఉదయం నిద్రలేచిన వెంటనే బద్ధకం ఉంటుంది. కానీ, ఉత్సహంగా ఉంటారు. అయితే, ఏ పని చేయకుండానే ఉదయం పూట అలసట, నీరసం వస్తే అది కిడ్నీ వ్యాధికి సంకేతం కావచ్చు. కొంచెం దూరం నడిచినా అలసట భావన కలుగుతుంది. కిడ్నీలు వ్యర్థాల్ని తగిన విధంగా బయటకు పంపకపోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు పెరిగిపోతాయి. దీంతో, అలసట కలుగుతుంది.
మూత్రంలో నురుగు
ఉదయం పూట మూత్రంలో ఎక్కువగా నురుగు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. మూత్రంలో కొద్దిగా నురుగు రావడం సాధారణమే. కానీ అది సాధారణం కంటే ఎక్కువగా, నిరంతరం జరుగుతుంటే, అది ప్రోటీన్ లీకేజీని సూచిస్తుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతం. ప్రోటీన్‌ను మూత్రపిండాలు సరిగ్గా క్లీన్ చేయకపోతే ఈ లక్షణం కనిపిస్తుంది. తరచుగా ఇలా జరిగితే వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
వికారం
ఉదయం నిద్రలేచిన వెంటనే వికారంగా అనిపిస్తే అది మూత్రపిండ సంబంధిత వ్యాధికి లక్షణం కావచ్చు. మూత్రపిండాల వైఫల్యం రక్తంలో విష పదార్థాల స్థాయిని పెంచడానికి కారణమవుతుంది. దీని వలన ఎటువంటి కారణం లేకుండా వికారం అనిపిస్తుంది. వికారంతో పాటు వాంతులు కూడా అవుతాయి. ఇది తరచుగా జరిగితే మాత్రం నిర్లక్ష్యం వద్దు.
డ్రై స్కిన్
ఉదయం నిద్రలేవగానే చర్మం నిర్జీవంగా, పొడిబారినట్టుగా కనిపిస్తే అది కూడా కిడ్నీ ఫెయిల్‌కి సంకేతం కావచ్చు. మూత్రపిండాలు శరీరానికి అవసరమైన మినరల్స్ సర్దుబాటు చేయకపోతే చర్మం పొడిగా మారుతుంది. తరచుగా ఈ లక్షణం కనిపిస్తే డాక్టర్‌ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మూత్రంలో రక్తస్రావం
ఉదయం నిద్రలేచిన వెంటనే మూత్ర విసర్జన చేస్తుంటారు. ఈ సమయంలో మూత్రంలో రక్తస్రావం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ లక్షణం కాదు. వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్. మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్రపిండాల వ్యాధిని కూడా సూచిస్తుంది. పైన పేర్కొన్న లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa