ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు కాకుంటే మరొకరు.. ట్రంప్‌కి శశిథరూర్ కౌంటర్

national |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 07:54 PM

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమంటోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి.. కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ మంత్రి శశిథరూర్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ తీరును తప్పుబట్టిన థరూర్.. దీనిని ‘మధ్యవర్తిత్వం అనరని.. అమెరికా తీసుకున్న నిర్మాణాత్మక పాత్రను సూచిస్తుంది’ అని ఆయన చెప్పారు.‘అమెరికా మధ్యవర్తిత్వం’తో భారత్–పాక్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10న శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే రెండు దేశాల ప్రభుత్వాలు అధికారికంగా కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రకటన చేశాయి. .


ఐక్యరాజ్యసమితి రాయబారిగా పనిచేసిన అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్.. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ. ‘అంతర్జాతీయ దౌత్యంలో ఇలాంటి ప్రవర్తనను నేను ఎప్పుడూ చూడలేదు.. ఇది చాలా దురదృష్టకర విషయం’ అని అన్నారు. భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు ఇటీవల కొన్ని రోజులుగా పలు దేశాధినేతలతో తమ సంభాషణలు, చర్చలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూనే ఉన్నారని థరూర్ చెప్పారు.


‘స్పష్టంగా చెప్పాలంటే… భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తోనూ.. ఆ తరవాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి‌తోనూ అమెరికా కౌంటర్ పార్ట్ మార్కో రూబియో మాట్లాడారు. ఈ మూడు, నాలుగు రోజుల సంక్షోభ సమయంలో ఇలాంటి సంప్రదింపులు జరుగుతున్నాయి. అంటే, ఇది భారత్‌కు మధ్యవర్తిత్వాన్ని కోరడం కాదు’ అని ఆయన వివరించారు. ఇరుదేశాల మధ్య అమెరికా చేసింది మధ్యవర్తిత్వం కాదని.. వాషింగ్టన్ తీసుకున్న నిర్మాణాత్మక పాత్ర’ అని అన్నారు.


‘అది మధ్యవర్తిత్వం కాదు.. అమెరికా నిర్మాణాత్మక పాత్ర పోషించింది... అమెరికా కాకుంటే ఇంకో దేశం ఇది చేసేది. UAE, UK, ఫ్రాన్స్ వంటి దేశాల విదేశాంగ మంత్రులతోనూ జైశంకర్ మాట్లాడారు’ అని థరూర్ కౌంటర్ ఇచ్చారు. వాస్తవం ఏంటంటే.. ఇటువంటి సమయంలో తరచుగా ఇతర దేశాలు ఇరువైపులా మాట్లాడి.. అందులో వారు ప్రతి దేశానికి మరొక వైపు గురించి తెలియజేస్తారని ఆయన అన్నారు. దీన్ని మధ్యవర్తిత్వం అని ట్రంప్ క్రెడిట్ తీసుకోలేరు.. ఎందుకంటే భారత్ ఎప్పుడూ మధ్యవర్తిత్వం కోరలేదు, ఏ విధంగానైనా భారత్ విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు. యాచించదు... మనం మనల్ని నిర్వహించుకోగలిగే సామర్థ్యం మనకు ఉంది.. ఆలోచనను భారత్ ఎప్పటికీ అంగీకరించదని నేను భావిస్తున్నాను’ అని థరూర్ ఉద్ఘాటించారు.


‘‘అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ తక్షణ పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి.... తెలివిగా వ్యవహరించినందుకు రెండు దేశాలకు అభినందనలు. ధన్యవాదాలు’’ అని ట్రంప్ మే 10న పోస్ట్ పెట్టారు. E తర్వాతి రోజు ‘రెండు దేశాల శక్తివంతమైన నాయకత్వాన్ని చూసి గర్వంగా ఉంది. అమెరికా మద్దతుతో ఈ శాంతిపూర్వక నిర్ణయానికి రావడం నేను గర్విస్తున్నా’ అని ట్రంప్ మరో పోస్ట్ పెట్టారు. అంతేకాదు, కశ్మీర్ వివాదం పరిష్కారానికి తన వంతు సహకారం అందజేయస్తానని కూడా సూచించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa