ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ గట్టి వార్నింగ్.. నిధుల మంజూరుపై 11 ఆంక్షలు

international |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 07:57 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాయాది దేశంపై అనేక చర్యలు చేపట్టింది. ఓవైపు దౌత్యపరంగా దెబ్బతీస్తూనే మరోవైపు సైనిక దాడులు చేసి చుక్కలు చూపించింది. దీంతో పాక్ కాళ్ల బేరానికి రాగా ఇండియా కూడా అంగీకరించింది. ఇలా భారత్ చేపట్టిన అన్ని చర్యలతో పాకిస్థాన్ రాజకీయ, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) పాకిస్థాన్‌పై మరోసారి కఠినమైన ఆర్థిక షరతులు విధించింది. ఇప్పటికే బైలౌట్ కోసం యాచిస్తున్న ఇస్లామాబాద్‌కు IMF విధించిన 11 కొత్త షరతులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి భారత్ పాకిస్థాన్‌ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి దాయాది దేశానికి పెద్ద మొత్తంలో రుణాలు రాకుండా ఉండాలని చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ ఐఎంఎఫ్ మాత్రం పాక్‌కు రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. భారత్ కచ్చితంగా ఆ దేశానికి నిధులు ఇవ్వొద్దని చెప్పడం వెనుక మొదటి కారణం.. ఆ డబ్బులతోనే పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిచడం. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసం అయిన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు ఇస్తున్న కూడా పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.


దీంతో భారత్ మరోసారి రంగంలోకి దిగి పాకిస్థాన్‌కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఎంఎఫ్ ఆ దేశానికి నిధులు సమకూర్చడంపై పునరాలోచించుకోవాలని భారత సర్కారు కోరింది. కానీ ఇవేవీ పట్టించుకోని ఐఎంఎఫ్ పాక్‌కు 1 బిలియన్ డాలర్లను విడుదల చేసింది. కానీ భారత్ చేసిన ఆరోపణలతో ఆ దేశంపై అనేక అంక్షలు విధించింది. ముఖ్యంగా 11 నిబంధనలు పెట్టింది. అందులో పాకిస్థాన్ ప్రభుత్వం రక్షణ వ్యయాలను మరింత పారదర్శకంగా చేయాలని, చమురు, ఎరువుల సబ్సిడీలపై కోతలు విధించాలని సూచించింది. అంతేకాకుండా, పాలన వ్యవస్థలో మార్పులు, ఆర్థిక రంగ సంస్కరణలు, విదేశీ రుణాల వినియోగంపై పూర్తి నివేదికలు సమర్పించాలని డిమాండ్ చేసింది.


IMF విధించిన 11 కొత్త షరతులు:


రూ. 17.6 లక్షల కోట్ల బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం: 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ బడ్జెట్‌ను జూన్ 2025లో IMF లక్ష్యాలకు అనుగుణంగా ఆమోదించాలి.


వ్యవసాయ ఆదాయ పన్ను సంస్కరణలు: నాలుగు రాష్ట్రాలూ కొత్త చట్టాలను అమలు చేయాలి. ఇందులో పన్ను చెల్లింపుదారుల గుర్తింపు, నమోదు, అనుగుణత మెరుగుదల ప్రణాళిక, కమ్యూనికేషన్ ప్రచారాలు, రిటర్న్ ప్రాసెసింగ్ ప్లాట్‌ఫారమ్ అమలు వంటి అంశాలు ఉన్నాయి.


పాలన చర్యల ప్రణాళిక: IMF పాలన డయాగ్నోస్టిక్ అసెస్‌మెంట్ ఆధారంగా పాలన సంస్కరణ వ్యూహాన్ని ప్రభుత్వం ప్రచురించాలి.


2027 తర్వాతి ఆర్థిక రంగ వ్యూహం: ఆర్థిక రంగానికి సంబంధించి సంస్థాగత, నియంత్రణ లక్ష్యాలను వివరించే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి ప్రచురించాలి.


వార్షిక విద్యుత్ టారిఫ్ పునఃస్థాపన నోటిఫికేషన్: జూలైలో టారిఫ్‌లను స్థిరంగా ఉంచేందుకు సంబంధిత నోటిఫికేషన్ జారీ చేయాలి.


విదేశీ మారక ద్రవ్య నిల్వల లక్ష్యాలు: విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచేందుకు నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవాలి.


విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో పారదర్శకత: విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో పారదర్శకతను మెరుగుపరచాలి.


పన్ను విధానంలో సంస్కరణలు: పన్ను విధానంలో సంస్కరణలు చేపట్టాలి.


సబ్సిడీల తగ్గింపు: సబ్సిడీలను తగ్గించాలి.


రాష్ట్ర రంగ సంస్థల సంస్కరణలు: రాష్ట్ర రంగ సంస్థలలో సంస్కరణలు చేయాలి.


విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం: విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలి.


ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణం, కరెంట్ సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు IMF నిర్ణయం కొత్త ఆర్థిక ముప్పుగా మారనుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజాగా విధించిన 11 షరతులతో కలుపుకుని.. మొత్తం షరతుల సంఖ్య 50కి చేరుకుందని ఎక్స్‌ప్రెస్ టిబ్యూన్ నివేదిక వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa