భారత్‌తో ఉద్రిక్తతల కొనసాగుతోన్న తరుణంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీతో భేటీ అయ్యారు. పాక్ ప్రధాని వెంట పాక్ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ సైతం ఉన్నారు. ఈ సందర్భంగా భారత్‌తో ఉద్రిక్తతలు, గాజా అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. గతేడాది పరస్పరం వైమానిక దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు పరిష్కారానికి పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్ అంశం, భారత్‌తో జల వివాదం గురించి షెహబాజ్ ప్రస్తావించారు. దీనికి ఇరాన్ సుప్రీం నేత ఆయుతుల్లా ఖమేనీ స్పందిస్తూ.. భారత్‌తో విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కుండబద్దలుకొట్టారు.
అక్టోబర్ 7, 2023లో హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. అయితే, పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా ఇజ్రాయేల్‌ను పాకిస్థాన్ వ్యతిరేకించడంపై ఖమేనీ ప్రశంసలు కురిపించారు. ‘ఇస్లామిక్ దేశాలపై వత్లిళ్లను లెక్కచేయకుండా నిజమైన పాలస్తీనా మద్దతుదారుడిగా పాకిస్థాన్ నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఇరాన్ స్పందన
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, ఖమేనీని కలిసిన సమయంలో కశ్మీర్ సమస్య, సింధూ జలాల వివాదంపై చర్చలకు సిద్ధమని షెహబాజ్ ప్రకటించారు. ‘దీర్ఘకాలికంగా భారత్‌తో కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధం.... కశ్మీర్ సహా ఉగ్రవాదంపై పోరు, నీటి వివాదాలు వాణిజ్యం అన్నింటిపై సామరస్యంగా చర్చించడానికి పాక్ సిద్ధంగా ఉంది... ఒకవేళ భారత్ అందుకు సమ్మతిస్తే.. శాంతిని మేము ఎంత బలంగా కోరుకుంటున్నామో తెలియజేస్తాం’ అని షెహబాజ్ అన్నారు.
దీనికి ఖమేనీ మాట్లాడుతూ.. ‘భారత్-పాకిస్థాన్‌లు తమ మధ్య విబేధాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నాం’ అని చెప్పారు. అలాగే, ముస్లిం దేశాల ఐక్యతే శాంతి కాపాడే మార్గమని ఖమేనీ పేర్కొన్నారు. యుద్ధాలను రెచ్చగొట్టే శక్తుల పట్ల ముస్లిం దేశాలు ఐక్యతగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. .
2024 జనవరిలో పాకిస్థాన్ భూభాగంలో జైష్ అల్ అదల్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఇరాన్ వైమానిక దాడి చేసింది. దీనికి ప్రతిస్పందనగా పాక్ సైతం ఇరాన్ సరిహద్దుల్లోని బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ శిభిరంపై దాడులు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ఉద్రిక్తతలు తీవమయ్యాయి. తాజాగా, ఇరాన్‌లో షెహబాజ్ పర్యటన వాటిని తగ్గించుకునేందుకు సహకరిస్తుందని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది.
భారత్-ఇరాన్ సంబంధాలు
ఆపరేషన్ సిందూర్ అనంతరం మే 9న భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఇరాన్ మంత్రి అరఘ్చి మధ్య ఇండియా-ఇరాన్ ఉమ్మడి కమిషన్ సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ప్రాంతీయ సహకారం అవసరమని ఇరువురూ ప్రకటించారు. పాక్‌తో చర్చల కోసం మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఇరాన్ చెప్పినప్పటికీ, భారత్ దీనిని ద్వైపాక్షిక సమస్యగా పేర్కొంటూ పీవోకే తిరిగి ఇవ్వడమే ఒక్కటే చర్చల అంశమని స్పష్టం చేసింది.
గాజాపై భారత అభిప్రాయం
గాజా విషయంలో ముందు నుంచి భారత్ తటస్థంగా వ్యవహరిస్తోంది. పాలస్తీనా కోసం ద్విరాజ్య పరిష్కారాన్ని భారత్ మద్దతిస్తోంది. అక్టోబర్ దాడులను ఖండించిన భారత్, ఇజ్రాయేల్-హమాస్ యుద్ధంలో పౌరుల మరణాలను కూడా ఖండించింది. శాశ్వత ప్రమాదాన్ని నివారించి, మానవీయ సహాయం అవసరమని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa