ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూతురి క్లాస్‌మేట్‌తో ప్రేమ.. ,,, మేక్రాన్-బ్రిగిట్టే లవ్ స్టోరీ..!

international |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 07:52 PM

భార్య చేతిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ చెంపదెబ్బ తిన్న వ్యవహారం అంతర్జాతీయ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వియత్నాంలో విమానం దిగుతున్నప్పుడు భార్య బ్రిగిట్టే.. మెక్రాన్ చెంప చెల్లుమనిపించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భార్య బ్రిగిట్టే తనను కొట్టలేదని కవరింగ్ ఇచ్చుకున్నారు. దీంతో ఈ దంపతుల ప్రేమాయణం మరోసారి వార్తల్లో నిలిచింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఆయన సతీమణి బ్రిగిట్టే మేక్రాన్‌ల ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్చలకు దారితీసింది. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా, గురు-శిష్యుల సంబంధంతో మొదలై, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఒక పటిష్టమైన బంధంగా మారిన ప్రేమకథ ఇది.


ఈ ప్రేమకథ గురించి తెలియాలంటే 1990 దశకంలోకి వెళ్లాల్సిందే. ఫ్రాన్స్‌లోని అమియాన్స్‌లో ఉన్న లైసీ లా ప్రొవిడెన్స్ హైస్కూల్‌లో ఈ కథ మొదలైంది. అప్పుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ 15 ఏళ్ల విద్యార్థి, బ్రిగిట్టే ట్రోగ్నోక్స్ 39 ఏళ్ల డ్రామా టీచర్. బ్రిగిట్టే, మెక్రాన్ క్లాస్‌మేట్ అయిన తన కుమార్తె లారెన్స్‌కు కూడా తల్లి. బ్రిగిట్టేకు మెక్రాన్ చాలా ఇష్టమైన విద్యార్థి. వారిద్దరూ కలిసి స్కూల్లో నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు ఈ సమయంలోనే వారిద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. మెక్రాన్ మేధస్సు, అభిరుచి బ్రిగిట్టేను ఆకట్టుకోగా, ఆమె కరిష్మా, ఆలోచనలకు మెక్రాన్ ప్రభావితుడయ్యాడు.


సవాళ్లు, దూరం... పట్టుదల


వారి మధ్య వయస్సులో 24 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఈ సంబంధం గురించి తెలుసుకున్న మెక్రాన్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ బంధాన్ని విడగొట్టేందుకు మేక్రాన్‌ను వారు పారిస్‌కు పంపించి, అక్కడ ఉన్న ప్రఖ్యాత లైసీ హెన్రీ IVలో విద్యను పూర్తి చేయమని కోరారు. బ్రిగిట్టే కూడా మొదట్లో ఈ సంబంధం తన పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుందేమో అని భయపడింది. అయితే, ఈ ఎడబాటు వారి బంధాన్ని బలహీనపరచలేదు. లేఖల ద్వారా అప్పుడప్పుడు కలిసేవారు. మెక్రాన్ పారిస్‌కు వెళ్లే ముందు.. ‘మీరు ఏమి చేసినా.. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను’ అని ఆమెతో చెప్పడం విశేషం.


పెళ్లి- రాజకీయ ప్రయాణం


మేక్రాన్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, వారి బంధం మరింత పటిష్టమైంది. 2006లో బ్రిగిట్టే తన మొదటి భర్త ఆండ్రే-లూయిస్ ఆజియేర్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2007 అక్టోబర్ 20న 29 ఏళ్ల మెక్రాన్, 54 ఏళ్ల బ్రిగిట్టే లే టూకేట్ అనే బీచ్ రిసార్ట్‌లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి, ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు.


పెళ్లయిన తర్వాత, బ్రిగిట్టే ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి, మెక్రాన్ రాజకీయ ప్రయాణానికి మద్దతుగా నిలిచింది. తన భర్తకు ప్రసంగాలకు సలహాలు ఇవ్వడం, ఆయన ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించడం వంటి పనులు చేసింది. ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తన రాజకీయ జీవితంలో ఎదిగే కొద్దీ, బ్రిగిట్టే ఆయనకు బలమైన మద్దతుగా, సన్నిహిత సలహాదారుగా నిలిచింది.


ప్రజా జీవితంలో...


మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, బ్రిగిట్టే ఫస్ట్ లేడీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు అధికారిక పదవి లేకపోయినా, తన భర్త పక్కన నిలబడి, ప్రభుత్వ కార్యక్రమాల్లో, అంతర్జాతీయ పర్యటనల్లో పాల్గొంటారు. వారి మధ్య వయసులో వ్యత్యాసం, వారి సంబంధం ప్రారంభం వంటి వాటిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, వారు తమ బంధంపై పూర్తి విశ్వాసంతో, ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ, అనేకమందికి స్ఫూర్తినిస్తూ ఉన్నారు. ఈ ప్రేమకథ, వయసు, సామాజిక అంచనాలకు అతీతంగా ప్రేమ బంధం ఎంత బలంగా ఉంటుందో చాటిచెబుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa