ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకున్న బెంగళూరు పోలీసులు.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్

national |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 08:08 PM

సాధారణంగా తప్పు చేసిన వారిని పట్టుకొని, సరైన దారిలో పెడుతుంటారు పోలీసులు. వారికి నిందితులు వినే స్థాయిలో లేకపోతే కోర్టులకు తీసుకు వెళ్తూ.. వారికి శక్షలు పడేలా చేసి జైల్లో పెట్టిస్తుంటారు. అక్కడ కూడా వీరు మారేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ మనం ఇప్పుడు చూడబోయే పోలీసులు మాత్రం తప్పు చేసిన వారిని దండించాల్సింది పోయి వారే దారి తప్పి ప్రవర్తించారు. ముఖ్యంగా IPL టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారు.ఈ విషయం గుర్తించిన పోలీసులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.


మే 17న విజయనగర పోలీసులకు ఓ సమాచారం అందింది. నచికేత పార్క్ సమీపంలో ఒక యువకుడు ఐపీఎల్ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నాడని తెలిసింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పట్టుకున్నారు. అలాగే అతడి వద్ద ఉన్న 41 టిక్కెట్లు, రూ.20 వేల నగదు, ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ టిక్కెట్లు అమ్మే వ్యక్తి పేరు శంకర్ అని అతడి వయసు 19 ఏళ్ల అని కూడా పోలీసులు గుర్తించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన స్టైల్లో విచారించగా.. మరో వ్యక్తి కూడా తనలాగే టిక్కెట్లు అమ్ముతున్నట్లు చెప్పాడు. అలాగ ఈ టిక్కెట్లను తమకు ఇచ్చింది పోలీసులే అని చెప్పగా.. అధికారులు విస్తుపోయారు.


ఎవరు వాళ్లు, ఎక్కడుంటారని ఆరా తీయగా... ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్ కంట్రోల్ రూమ్‌కు చెందిన వెంకటగిరి గౌడ మరియు హలసూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కె రవిచంద్రలతో పాటు సురేష్.. అనే ముగ్గురు తమతో ఈ పని చేయిస్తున్నారని శంకర్ వెల్లడించాడు. దీంతో పోలీసులు సురేష్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు కూడా ట్రాఫిక్ కానిస్టేబుళ్లే తమకు టిక్కెట్లు ఇస్తున్నట్లు చెప్పాడు. ఎక్కువ ధరకు టిక్కెట్లను అమ్మిన తర్వాత వచ్చిన డబ్బును అంతా కలిసి పంచుకునే వాళ్లమని కూడా పేర్కొన్నాడు. అలాగే ఇతడి వద్ద ఉన్న 11 టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఇలా వీరిద్దరూ కానిస్టేబుళ్ల పేర్లే చెప్పగా.. పైఅధికారులు వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యంగా ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఎం.ఎన్. అనుచేత్ స్పందిస్తూ.. యావత్ పోలీస్ శాఖే తల దించుకునే ఘటన ఇదని వ్యాఖ్యానించారు. విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించామని తెలిపారు. అంతేకాదు అసలు టిక్కెట్లను విడుదల చేసిన ఆర్గనైజింగ్ సంస్థ నుండి వివరాలను కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa