ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు దశల్లో కులగణన, కేంద్ర కేబినెట్ నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 08:08 PM

తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతీ 10 ఏళ్లకోసారి జరిగే జనగణన.. 2021 నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పుడు అప్పుడు అంటూ కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తోంది. తాజా కేంద్ర కేబినెట్ భేటీలో జనగణనకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కులగణనను రెండు దశల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా తొలి దశ కులగణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.


అయితే వాస్తవానికి 2020 ఏప్రిల్లో జాతీయ జనాభా గణన ప్రారంభం కావాల్సి ఉండగా.. అప్పుడే దేశంలో కరోనా మహమ్మారి వెలుగు చూడటంతో వాయిదా పడింది. ఒకవేళ కొవిడ్ వైరస్ వ్యాప్తి లేక అప్పుడే ఈ జనగణన చేసి ఉంటే.. తుది నివేదిక 2021 నాటికి వెలువడేది. ఇక తొలి దశలో భాగంగా 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కులగణన, జనగణన చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.


రెండో దశ 2027 మార్చి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కులగణనతో పాటు జనగణనను నిర్వహించనున్నారు. ఈ కులగణన, జనగణన ప్రక్రియకు సంబంధించిన అధికారిక గెజిట్‌ను జూన్ 16వ తేదీన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జనగణన, కులగణనలో పురుషులు, మహిళలను లెక్కించనున్నారు. ఇందులో భాగంగానే కులం, ఉపకులాలను లెక్కించి జాబితాను తయారు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్‌ జనరల్ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా పర్యవేక్షణలో ఈ జనాభా లెక్కలను నిర్వహించనున్నారు.


ఈ జనగణన, కుల గణనను పారదర్శక పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గత కొన్నేళ్లుగా.. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలు కులగణన సర్వేను నిర్వహించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa