ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్య

Crime |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 06:08 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అనంతపురం ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో నిందితుడు నరేష్‌ను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. తన్మయి హత్యకు గల కారణాలు ఏంటి.. నరేష్ ఎందుకు అంత కిరాతకంగా హత్య చేశాడనే వివరాలను అనంతపురం పోలీసులు వెల్లడించారు. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసు గురించి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసు పూర్వాపరాలను ఎస్పీ జగదీష్ వెల్లడించారు.


అనంతపురంలోని రామకృష్ణ కాలనీలో ఉండే తన్మయికి 20 ఏళ్లు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. అయితే జూన్ 3వ తేదీ నుంచి తన్మయి కనిపించకుండా పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి రాలేదు. దీంతో తన్మయి కుటుంబసభ్యులు భయపడిపోయారు. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ మరుసటి రోజు అనంతపురం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తన్మయి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మిస్సింగ్ కేసు మోదు చేశారు. తన్మయి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు రాయదుర్గానికి చెందిన ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకుని విచారించారు.


ఇంటి నుంచి వెళ్లి.. రోడ్డు పక్కన ముళ్ల పొదల్లో..


నాలుగు రోజులు గడిచింది. తన్మయి జాడ లేదు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు కానీ.. ఎలాంటి సమాచారం లేదు. తన్మయి తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగి పోయింది. చివరకు ఏదైతే వినకూడదని అనుకున్నారో అలాంటి వార్తనే వినాల్సి వచ్చింది. జూన్ 7వ తేదీ రాత్రి.. కూడేరు మండలం గొట్కూరు సమీపంలో హైవే పక్కన ముళ్లపొదల్లో ఓ యువతి శవం కనిపించినట్లు స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో తన్మయి తల్లిదండ్రులకు పోలీసులు విషయం చెప్పారు. యువతి మృతదేహం చూసిన తన్మయి తల్లిదండ్రులు.. చనిపోయింది తమ కూతురేనని నిర్ధారించారు.


ఈ సంఘటన గురించి తెలిస్తే.. దెబ్బకు పెళ్లంటే పారిపోతారు!


మిస్సింగ్ కాస్తా మర్డర్.. ఎవరా హంతకులు.?


తన్మయి హత్య కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. తలపై బలంగా కొట్టి హత్య చేశారని నిర్ధారించుకున్నారు. హత్య చేసిన వారిని గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన్మయికి నరేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని.. మూడు నెలల క్రిందట ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసిందని గుర్తించారు. నెలరోజులుగా వారిద్దరూ ప్రేమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.


పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. పాపం చివరకు అలా..


అయితే నరేష్‌కు అప్పటికే పెళ్లైంది. ఈ విషయాన్ని నరేష్ తన్మయికి కూడా చెప్పాడు. అయితే తనను కూడా పెళ్లి చేసుకోవాలంటూ తన్మయి నరేష్‌పై ఒత్తిడి తేవటం ప్రారంభించింది. దీంతో తన్మయిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్న నరేష్.. దుర్మార్గమైన ప్లాన్ వేశాడు. జూన్ మూడో తేదీన తన్మయిని బైక్ మీద ఎక్కించుకుని వెళ్లిన నరేష్.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. తలపై బలంగా మోది హత్య చేశాడు.


తన్మయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు సత్వరమే స్పందించలేదనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనంతపురం వన్ టౌన్ సీఐను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామన్న అనంతపురం ఎస్పీ జగదీష్.. చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. అలాగే నిందితుల కుటుంబం ఆస్తులను అటాచ్ చేయటం, సంక్షేమ పథకాల నిలుపుదలపై ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ఎస్పీ జగదీష్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa