ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైతుల అకౌంట్‌లలోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 06:20 PM

ఏపీలో రైతులకు ముఖ్యమైన గమనిక.. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి పెట్టుబడి రాయితీ డబ్బుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏప్రిల్‌ 3 నుంచి 22 వరకు కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.. ఈ మేరకు ఉద్యానశాఖ ప్రభుత్వానికి పంట నష్టంపై నివేదించింది. ఈ మేరకు రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఏప్రిల్‌ 3 నుంచి 5 వరకు జరిగిన పంట నష్టానికి రూ.90.85 లక్షలు చొప్పున.. ఏప్రిల్‌ 7 నుంచి 22 వరకు జరిగిన పంట నష్టానికి రూ.4.47 కోట్లు విడుదల చేసినట్లు విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఈ డబ్బుల్ని రైతులు అకౌంట్‌లలోకి జమ చేస్తున్నారు.


మరోవైపు ఏపీ ప్రభుత్వం రోడ్లు, కల్వర్టుల మరమ్మతులకు కూడా నిధుల్ని విడుదల చేసింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 11 జిల్లాల పరిధిలో పంచాయతీరాజ్‌ రోడ్లు, కల్వర్టులు దెబ్బ తిన్నాయి. ఇవి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయి. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రభుత్వానికి నివేదించగా.. వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.12.84 కోట్లు విడుదల చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల మేరకు నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.


ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లు, అంతకంటే ఎక్కువ పెట్టుబడులతో చేపట్టే మెగా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల్ని నియమించింది. 'ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలు, పథకాల అమలు పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయం, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు జిల్లాకు ఒకరి చొప్పున సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తూ ఈ ఏడాది మార్చి 10న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని ఐదు జోన్లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. జిల్లా ఇన్‌ఛార్జులుగా ఉన్న అధికారులనే ఆయా జిల్లాల్లో రూ.వెయ్యి కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులతో చేపట్టే పరిశ్రమలు, ప్రాజెక్టులకు నోడల్‌ అధికారులుగా నియమించాల్సిందిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) సీఈఓ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ అధికారులు వారికి కేటాయించిన ప్రాజెక్టులకు ‘సింగిల్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌’గా వ్యవహరిస్తారు. భూసేకరణ వంటి అంశాల్లో సమస్యలుంటే పరిష్కరిస్తారు' అని అధికారులు తెలిపారు.


ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో నల్లమల అడవులను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు విశేష కృషి చేస్తున్న పర్యావరణవేత్త కొమెర అంకారావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (అడవుల పరిరక్షణ) నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. అయితే ఆ ఆదేశాల మేరకు ప్రభుత్వం కొమెర అంకారావును సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు.. ఈ నియామకం విధివిధానాల్ని త్వరలో జారీచేస్తామని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa