ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడి కోసం .. భర్త, పిల్లలు, అత్తామామలకు పాయిజన్

Crime |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 08:09 PM

ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నాక కూడా పరాయి పురుషులతో ప్రేమలో పడుతున్నారు. చాటుమాటుగానే వ్యవహారం సాగిస్తూ.. వారిని పెళ్లి చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుని మరీ అతడితో వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు ఎన్నో వెలుగులోకి రాగా.. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ మహిళ అచ్చంగా ఇలాగే ప్రవర్తించింది.


ప్రియుడి కోసం ఏకంగా తన కుటుంబంలోని ఐదుగురు సభ్యులను అంతమొందించాలనుకుంది. అందులో భర్త, ఇద్దరు పిల్లలు సహా అత్తమామలు ఉన్నారు. అయితే రెండు నెలలుగా వీరు తినే ఆహారంలో నిద్ర మాత్రలు కలుపుతున్న ఈమె కథ బయటకు రాగా.. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు అంతా బతికిపోయారు. మరి ఈ నిజం ఎలా నిగ్గు తేలిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


  కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన 33 ఏళ్ల చైత్రకు గజేంద్రతో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం వరుసగా వారి వయసు 10, 8 ఏళ్లు కాగా.. ఇంట్లోనే ఉంటూ వారిని చూసుకుంటోంది. భర్త ఉద్యోగం చేస్తున్నాడు. అత్తమామలు కూడా వీరి దగ్గరే ఉంటున్నారు. అయితే ఇంతకాలం బాగానే ఉన్న చైత్రకు మూడేళ్ల క్రితం నుంచి పరాయి పురుషులపై మనసు పారేసుకుంటోంది. తొలిసారి పునీత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగించింది. ఎవరికీ తెలియకుండానే చాటుమాటుగా వ్యవహారం సాగించినా.. ఓరోజు భర్త చూశాడు. దీంతో అతడు చైత్ర తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.


ఇలా ఇరుకుటుంబాలు జోక్యం చేసుకోవడంతో.. చైత్రకు బుద్ధి చెప్పారు. ఇక నుంచి భర్తతో చక్కగా ఉంటానని చెప్పగా ఓకే అనుకున్నారు. గజేంద్ర కూడా భార్యను తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకున్నాడు. కొన్ని నెలలు బాగానే ఉన్నప్పటికీ.. చైత్ర నివసించే ప్రాంతంలోనే ఉండే శివ్ అనే వ్యక్తితో ఆమెకు స్నేహం ఏర్పడింది. అదికాస్తా త్వరగానే వివాహేతర సంబంధంగా మారింది. ఇది కూడా భర్తకు తెలియగా.. చైత్రతో గొడవ పడ్డాడు. దీంతో ఆమెనే అతడిపై కేసు పెట్టగా.. గజేంద్ర కొన్నాళ్లు జైల్లోనే ఉన్నాడు. కానీ కొన్ని నెలల క్రితమే విడుదల అయి ఇంటికి వచ్చాడు. ఇక అప్పటి నుంచి చైత్ర భర్త, పిల్లలు, అత్తమామలపై అతిప్రేమ చూపిస్తోంది.


ప్రతిరోజూ వీరికి అన్ని రకాల వంటకాలను ఆమెనే దగ్గరుండి వండి వార్చి పెడుతోంది. అయితే చైత్ర తీరు అనుమానంగా తోచగా.. గజేంద్ర ఆమెపై ఓ కన్నేశాడు. ఆమె ఫోన్ చూస్తే.. ఆమె ప్లాన్ తెలుస్తుందని ఫోన్ కోసం వెతికాడు. ఈ సమయంలోనే ఆమె బ్యాగులో 40 నుంచి 50 వరకు మాత్రలు దొరికాయి. దీంతో వాటిలోంటి ఓ షీట్‌ను దోచేసిన అతడు నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. ఈ మాత్రలను దేనికోసం వాడతారని అడగ్గా.. వైద్యుడు షాకింగ్ సమాధానం చెప్పారు. అవి నిద్ర మాత్రలు అని.. వైద్యుడు చెప్పకుండా వాటిని వాడకూడదని వివరించారు. అలాగే వీటిని రోజూ తీసుకుంటే స్లో పాయిజన్‌గా మారి త్వరలోనే ప్రాణాలు కోల్పోతారని వెల్లడించారు.


ఇదంతా విన్న గజేంద్ర నేరుగా ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తీసుకు వచ్చాడు. ముఖ్యంగా పిల్లలు, తల్లలిదండ్రులను తీసుకు వచ్చి తనతో సహా అందరికీ పరీక్షలు చేయించుకున్నాడు. ఈక్రమంలోనే వారంతా గత రెండు నెలలుగా స్లో పాయిజన్ తీసుకుంటున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు. అదృష్టవశాత్తు వీరు ప్రాణాలతో బయట పడ్డారు. అయితే తామందరినీ భార్య చంపాలని చూడగా.. వెంటనే గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చైత్రను, ఆమె ప్రియుడు శివ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆ మాత్రలు ఎవరిచ్చారు, కుటుంబ సభ్యులను చంపాలనే ఐడియా ఇచ్చింది ఎవరని తెలుసుకునే పనిలో పడ్డారు.


మరోవైపు పిల్లలు కూడా తమ తల్లి ఆ మాత్రలను టీ, కాఫీలతో పాటు ఇతర ఆహార పదార్థాల్లో కలపడం చూశామని చెప్పారు. గజేంద్ర సహా అతడి తల్లిదండ్రులు ఇద్దరూ.. భోజనం చేసిన తర్వాత వికారం, తలతిప్పడం వంటివి అయ్యేయని పేర్కొన్నారు. కానీ ఏరోజు తమ కోడలిని అనుమానించలేదని.. తమ కొడుకు మాత్రలను చూడడం వల్లే ఆమె చేసిన కుట్ర బయటపడిందని చెప్పుకొచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa