భారతీయుల వారసత్వ సంపద అయిన వేదాల్లో ఒకటైన అధర్వణవేదంలో ఒక శాఖ ఆయుర్వేదమని, శాస్త్రీయంగా నిరూపితమైన ఈ విజ్ఞానం మానవాళికి మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం ఉద్ఘాటించారు. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాల 36వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ ఆయుర్వేదానికి ఇటీవల ప్రాచుర్యం పెరుగుతోందని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే దీనికి కారణమని తెలిపారు. ఈ వైద్య విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఆయుర్వేద ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యలో పెరుగుతోందని, అదనంగా ఓపి బ్లాక్ నిర్మిస్తామని వెల్లడించారు. కళాశాల, ఆసుపత్రిని కలిపి ప్రహరీ నిర్మించి ఆర్చిని ఏర్పాటు చేస్తామన్నారు. కళాశాలలో చదువు పూర్తయిన తరువాత విద్యార్థులు ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ఉపాధి పొందుతున్నారనే విషయంపై సమాచారాన్ని సిద్ధం చేయాలని, తద్వారా కళాశాల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టే అవకాశముంటుందని అన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, సమయపాలన, క్రమశిక్షణ పాటించి అంకితభావంతో కృషి చేసి వాటిని సాధించుకోవాలని సూచించారు.
అంతకుముందు ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా.. ఎ.శంకర్‌బాబు కళాశాల వార్షిక నివేదికను వినిపించారు. ఇప్పటివరకు 30 బ్యాచ్‌లలో విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ధన్వంతరి పురుషుల వసతిగృహంలో 50 మంది, పిజి పురుషుల వసతిగృహంలో 26 మంది, కాస్యప బాలికల వసతిగృహంలో 99 మంది, పిజి మహిళా వసతిగృహంలో 38 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు. కళాశాల విద్యార్థిని విద్యార్థులు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పిస్తున్నారని, క్రీడల్లోనూ రాణిస్తున్నారని తెలియజేశారు.
ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.. వి.పార్వతిదేవి మాట్లాడుతూ ఆసుపత్రి వార్షిక నివేదికను వినిపించారు. 2018-19వ సంవత్సరంలో 1.40 లక్షల మంది రోగులకు సేవలందించామని, 3,286 మంది ఇన్‌పేషంట్లు నమోదుయ్యారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా రోగులు వైద్యం కోసం వస్తున్నారని వెల్లడించారు. ఐఎస్‌వో గుర్తింపు కోసం తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అనంతరం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలు, వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు జెఈవో చేతులమీదుగా ట్రోఫీలు, బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డా.. రేణుదీక్షిత్, డా.. పి.మురళీకృష్ణ, డా..కెవి.విజయభాస్కర్‌రెడ్డి, విద్యార్థుల ప్రతినిధి డా.. టి.నరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.