ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో గతవారం ఇజ్రాయేల్ యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో ఇజ్రాయేల్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహాయం లేకుండా ఇరాన్ అణు కేంద్రాన్ని నాశనం చేసే శక్తి ఇజ్రాయేల్‌కు లేదని ఆయన అన్నారు. న్యూజెర్సీలో మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. ఇజ్రాయేల్ దాడుల్లో చాలా సైనిక లబ్ది పొందింది. కానీ అమెరికా సాయం లేకుండా ఇరాన్‌లోని ఫోర్డ్ అణు కేంద్రాన్ని నాశనం చేయడం ఇజ్రాయేల్ వల్ల కాదు. ఒకవేళ దాడి చేసినా పెద్దగా ఫలితం ఉండదని, వారికి ఆ శక్తి లేదు అని అన్నారు.
‘మా సాయం లేకుండా ఫోర్డ్‌లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయేల్‌కు లేదు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను దౌత్యానికి సిద్ధంగా ఉన్నానని, కానీ ఇజ్రాయేల్‌ను సైనిక చర్యలు ఆపమని చెప్పడం కష్టమని ఆయన పేర్కొన్నారు.. ఎందుకంటే యుద్ధంలో ఎవరైనా విజయం సాధిస్తుంటే ఆపమని చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయేల్ దాడులు గురితప్పడం లేదని, అద్భుతంగా ఉన్నాయిన్న ట్రంప్. ఇరాన్ పేలవమైన దాడులు చేస్తోందని చెప్పారు.
ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య మధ్యవర్తిత్వానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ట్రంప్ అన్నారు. ‘యూరప్‌తో మాట్లాడటానికి ఇరాన్ ఇష్టపడటం లేదు... వారు మాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. నేను శాంతిని కోరుకుంటున్నాను.. కొన్నిసార్లు గట్టిగా ఉండాలి’ అని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇజ్రాయేల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి. అదే సమయంలో అమెరికా పాత్ర గురించి చర్చకు దారితీసే అవకాశం ఉంది.
వైట్ హౌస్ వర్గాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌పై సుదీర్ఘ దాడుల ప్రణాళికలను తన అత్యున్నత సైనికాధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సమావేశాల్లో జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డాన్ కైన్, సెంట్రల్ కమాండ్ (CENTCOM) చీఫ్ జనరల్ మైకేల్ కురిల్లా కూడా పాల్గొన్నారు. ‘దాడులు జరగడం చాలా సాధ్యమే’ అని న్యూయార్క్ పోస్ట్‌కు తెలిపారు. తదుపరి ఏం చేయాలి' అనే అంశంపై ట్రంప్ ముందుగానే పూర్తి సన్నద్ధత, వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని భావిస్తున్నారు... దశలవారీగా ముందుకు సాగే అనిశ్చిత కార్యక్రమాన్ని ఆయన ఇష్టపడటం లేదు’ అని ఆ వర్గం వివరించింది.
రిటైర్డ్ సైనికాధికారి జనరల్ జాక్ కేన్ ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ సుదీర్ఘ యుద్ధంపై గట్టిగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ‘ఇంతకాలం ఆయన ఒప్పందాలకు దూరంగా ఉన్నది యాదృచ్ఛికం కాదు. ఇరాన్ దాడిని తట్టుకోగలిగే స్థిర వ్యవస్థను నిర్మించింది. వారు దాడిని భరించగలరు.. తిరిగి పునరుద్ధరించగలరు. ఖమేనీ దీర్ఘకాల వ్యూహానికే కట్టుబడి ఉన్నారు... త్వరలోనే అతను ఎలాంటి ఒప్పందాన్ని చేసుకునే అవకాశాలు నాకు కనపడటం లేదు’ అని కేన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa