ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షా కాలంలోనూ నిద్ర పోనివ్వమంటూ..మావోయిస్టులకు అమిత్ షా వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 08:47 PM

 2026 మార్చి 31 నాటికి భారత దేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టులకు ఇకపై విశ్రాంతి ఉండదని.. వర్షా కాలంలో కూడా వారిపై కార్యకలాపాలను ముమ్మరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన దేశంలో నక్సలిజంపై ప్రభుత్వ పోరాటంలో నూతన దశను సూచిస్తోంది.


ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభం కాగానే మావోయిస్టులు అటవీ ప్రాంతాల్లోని తమ స్థావరాలకు చేరుకుంటారు. ఈ కాలాన్ని తమ బలాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి, వ్యూహాలను రచించడానికి "విశ్రాంతి" సమయంగా ఉపయోగించుకుంటారు. అయితే ఈసారి వారికి అలాంటి అవకాశం ఉండదని అమిత్ షా తేల్చి చెప్పారు. "ప్రతి సంవత్సరం వానకాలంలో మావోయిస్టులు రెస్ట్ తీసుకుంటారు. కానీ ఈ వానకాలం వాళ్లకి నిద్ర లేకుండా చేస్తాము" అని ఆయన దృఢంగా ప్రకటించారు.


కేంద్ర ప్రభుత్వం నక్సలిజం నిర్మూలనకు కట్టుబడి ఉందని, ఇందుకోసం సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోందని అమిత్ షా నొక్కి చెప్పారు. భద్రతా బలగాల కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తామని వివరించారు. అలాగే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం ద్వారా స్థానిక ప్రజలను వారి ప్రభావం నుండి దూరం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మావోయిస్టులు ఆయుధాలను వీడి లొంగిపోవాలని.. దేశ అభివృద్ధులు భాగస్వాములు కావాలని కూడా కోరారు. అలా చేయకుండా.. అడవుల్లో ఉండే అరాచకాలు చేస్తామంటూ చూస్తూ ఊరుకోమన్నారు. గత కొన్నేళ్లుగా నక్సల్స్ ప్రభావం గణనీయంగా తగ్గిందని, మిగిలిన ప్రాంతాల నుండి కూడా వారిని తరిమి కొడతామని అమిత్ షా దీమా వ్యక్తం చేశారు.


నక్సలిజం అనేది కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదని, అభివృద్ధి లేమి మరియు నిరుద్యోగం వంటి సామాజిక-ఆర్థిక సమస్యలతో ముడిపడి ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకేే మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. లొంగిపోయే నక్సలైట్లకు పునరావాసం కల్పించడం, సాధారణ జీవనం గడపడానికి సహాయం చేయడం వంటి చర్యలు కూడా చేపడుతున్నారు.


అమిత్ షా ప్రకటన భద్రతా బలగాలకు నూతనోత్సాహాన్ని నింపింది. రాబోయే వర్షాకాలంలో మావోయిస్టులపై నిరంతర ఆపరేషన్లు కొనసాగించడానికి ఇది సంకేతంగా నిలుస్తుంది. 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత భారతదేశం అనే లక్ష్యం నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో దృఢ సంకల్పంతో ఉందని అమిత్ షా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa