ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో 30, 40 ఏళ్లు బతకాలని ఆశగా ఉంది..: దలైలామా

national |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 09:41 PM

టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో తన 90వ పుట్టినరోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జులై 6వ తేదీన ఈయన పుట్టిన రోజు ఉండగా.. ఆయన అనుచరులు, భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దలైలామాకు దీర్ఘాయుష్షు ప్రసాదించమంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన ఆయన తన మనసులోని మాటన బయటపెట్టారు. తనకు మరో 30 నుంచి 40 సంవత్సరాలు జీవించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మానవ జాతికి, ముఖ్యంగా టిబెటన్ ప్రజలకు తన సేవలను కొనసాగించడానికి ఈ కాలాన్ని ఉపయోగించుకుంటానని ఆయన ప్రకటించారు.


దలైలామా ఈ సందర్భంగా తన ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకున్నారు. అవలోకితేశ్వరుడి (కరుణామయుడైన బోధిసత్వుడు) నుండి తనకు స్పష్టమైన సంకేతాలు, ఆశీర్వాదాలు లభించాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంకేతాలు తన దీర్ఘాయుష్షుకు, నిరంతర సేవకు భరోసా ఇస్తున్నాయని ఆయన నమ్మకంగా చెప్పారు. ఇదంతా చూస్తుంటే తాను 110 సంవత్సరాలు జీవిస్తానని అనిపిస్తోందని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత దేశంలో ప్రవాసంలో ఉన్నప్పటికీ.. ధర్మశాల నుంచి తాను అనేక మందికి ప్రయోజనం చేకూర్చగలిగానని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.


ప్రస్తుతం తనకు 90 ఏళ్లు నిండడంతో 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని.. దాన్ని నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని ఇటీవలే దలైలామా తేల్చి చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. 2011 సెప్టెంబర్ 24వ తేదీన తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగాలా వద్దా అనే అంశంపై అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని చైనాను ఉద్దేశించి అన్నారు.


అయనప్పటికీ దలైలామా వారసత్వంపై అంతర్జాతీయంగా, ముఖ్యంగా చైనా వైపు నుంచి కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తన వారసుడిని ఎంపిక చేసుకునే ప్రక్రియపై తరచుగా ప్రశ్నలు తలెత్తుతుండగా.. దలైలామా దీర్ఘకాలం జీవిస్తారనే ప్రకటన, ఈ చర్చలకు తాత్కాలికంగా తెరదించినట్లు భావిస్తున్నారు. తన జీవిత కాలంలోనే వారసుడి ఎంపికపై స్పష్టత ఇస్తానని గతంలో దలైలామా పరోక్షంగా సూచించారు.


ప్రపంచ శాంతికి, కరుణకు ప్రతీకగా నిలిచిన దలైలామా.. తన జీవితాన్ని బోధనలకు, మానవతా సేవకు అంకితం చేశారు. ఆయన బోధనలు, అహింసా మార్గం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తిని ఇచ్చాయి. దలైలామా దీర్ఘాయుష్షును కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు, భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. 90 సంవత్సరాల వయస్సులోనూ ఆయనలో కనిపించిన ఈ సంకల్పం, శక్తి అనేక మందికి ఆదర్శంగా నిలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa