ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయులకు యూఏఈ కానుక.. భారత్‌పై ప్రభావం ఏంటి?

international |  Suryaa Desk  | Published : Tue, Jul 08, 2025, 12:11 AM

భారత్ నుంచి ఏటా వేలాది మంది యూఏఈ వెళ్తుంటారు. పనికోసం ఎక్కువ మంది వెళ్తుండగా.. సినీ సెలబ్రిటీలు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఎక్కువగానే వెళ్తున్నారు. వీరిలో చాలా మంది అక్కడే స్థిరపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా ‘గోల్డెన్ వీసా’పై కీలక నిర్ణయం తీసుకుంది. లక్ష ఏఈడీ (భారత కరెన్సీలో దాదాపు రూ. 23.30 లక్షలు) ఫీజు చెల్లిస్తే.. జీవితకాలం చెల్లుబాటయ్యే గోల్డెన్ వీసాను అందిస్తోంది యూఏఈ. అంటే, ఈ వన్-టైమ్ పేమెంట్‌తో భారతీయులు ఇక పర్మినెంట్‌గా అక్కడే సెటిల్ అవ్వొచ్చన్నమాట. ఈ గోల్డెన్ వీసాతో ఎలాంటి వారికి ప్రయోజనం? అంతిమంగా భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? తదితర వివరాలు..


భారత్ నుంచి చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తుంటారు. వీరిలో చాలా మంది అక్కడే స్థిరపడటానికి వీసాలు పొందుతుంటారు. అయితే, ఇప్పటివరకు యూఏఈ నుంచి గోల్డెన్ వీసా పొందాలంటే వ్యాపారం చేస్తున్నట్లు ట్రేడ్ లైసెన్స్ లేదా అక్కడ ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాల్సి వచ్చేది. స్థిరాస్తిలో కనీసం 20 లక్షల ఏఈడీ (రూ. 4.66 కోట్లు) లేదా వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారికి గోల్డెన్ వీసా అందజేసేది. పదేళ్ల కాలానికి మాత్రమే ఈ గోల్డెన్ వీసాలను జారీచేసేది. గడువు పూర్తయ్యే లోగా వీటిని రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది.


భారత్‌కు చెందిన చాలా మంది వ్యాపారవేత్తలు, బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు, పలువురు క్రీడా ప్రముఖులు యూఏఈ నుంచి గోల్డెన్ వీసాలను పొందిన వారిలో ఉన్నారు. ముఖ్యంగా దుబాయ్‌లో ఎక్కువ మంది స్థిరాస్తులు కొనుగోలు చేశారు. ఇప్పుడు యూఏఈ మరో అడుగు ముందుకేసి గోల్డెన్ వీసా నిబంధనల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా రెసిడెన్సీ ప్రోగ్రామ్ నిబంధనలను మార్పు చేసింది. దీంతో అనేక వృత్తుల్లో పనిచేస్తున్న వ్యక్తులకు కూడా గోల్డెన్ వీసా పొందటానికి అర్హత లభించింది.


 గోల్డెన్ వీసాతో ఎవరెవరికి ప్రయోజనం?


భారత్ నుంచి దుబాయ్‌కి వెళ్లే వారిలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏటా వేలాది మంది యూఏఈకి వెళ్తున్నారు. అక్కడ డ్రైవర్లుగా, కూలీలుగా, ఇళ్లలో పనిమనుషులుగా, పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిలో కొంత మంది సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగారు. ఇక వివిధ వృత్తుల్లో నైపుణ్యం ఉన్న భారతీయులు.. యూఏఈలోని పలు నగరాల్లో బాగానే సంపాదించుకుంటున్నారు. యూఏఈ గోల్డెన్ వీసాలో తీసుకొచ్చిన మార్పులతో ఇప్పుడు ఇలాంటి వారికి కూడా అక్కడే స్థిరపడేందుకు అవకాశం లభించింది.


మార్పు చేసిన నిబంధనల ప్రకారం.. ఇంజనీర్లు, యూనివర్సిటీ ఫ్యాకల్టీ మెంబర్స్‌, డాక్టర్లు, నర్సులు, శాస్త్రవేత్తలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, స్కూల్ టీచర్లు, ప్రిన్సిపల్స్, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు, సర్టిఫైడ్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్లకు కూడా గోల్డెన్ వీసాలను అందించాలని యూఈఏ నిర్ణయించింది. గోల్డెన్ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను (భార్య, భర్త, పిల్లలు) కూడా స్పాన్సర్ చేయవచ్చు. ప్రధాన వీసా హోల్డర్ మరణించినా కుటుంబ సభ్యులు తమ వీసా గడువు ముగిసే వరకు యూఏఈలో నివసించే వెసులుబాటు ఉంటుంది.


యూఏఈ ప్రభుత్వం తొలి దశలో ప్రయోగాత్మకంగా భారత్‌, బంగ్లాదేశ్‌ పౌరులకు ఈ గోల్డెన్ వీసాలను అందిస్తోంది. వచ్చే 3 నెలల్లో 5 వేల మంది ఈ తరహా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని యూఈఏ అధికారులు అంచనా వేశారు. ఈ తరహా గోల్డెన్ వీసాలను జారీ చేసేందుకు భారత్‌లో ‘రయాద్ గ్రూప్’ కన్సల్టెన్సీని ఎంపిక చేసింది.


యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు భారతీయులకు ఇదొక మంచి అవకాశం. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కూడా దుబాయ్‌కు తీసుకురావొచ్చు. డ్రైవర్లను, ఇతర వ్యక్తిగత సహాయకులను నియమించుకోవచ్చు. యూఏఈలో ఏదైనా వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ వీసా జీవితకాలం చెల్లుబాటవుతుంది


- రయాద్ కమల్ అయూబ్, రయాద్ గ్రూప్ ఎండీ


ఎలా దరఖాస్తు చేసుకోవాలి?


యూఏఈ అందించే ‘నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా’ల కోసం భారతీయులు ఇక్కడ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. రయాద్ గ్రూప్ రిజిస్టర్డ్ కార్యాలయాలు, వన్‌వాస్కో కేంద్రాలు (వీసా సేవల కంపెనీ)ల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యూఈఏ ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది.


ఎలా జారీ చేస్తారు?


దరఖాస్తుదారుడి నేపథ్యాన్ని యూఏఈ అధికారులు తనిఖీ చేస్తారు. మనీ లాండరింగ్ వ్యవహారాల్లో ప్రమేయం ఉందా? ఏవైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా పరిశీలిస్తారు. సోషల్ మీడియా అకౌంట్లను కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. దరఖాస్తుదారుడు ఆర్థికం, వాణిజ్యం, సైన్స్, స్టార్టప్, ఉద్యోగ సేవలు లాంటి మార్గాల్లో యూఏఈ మార్కెట్‌కు ఎలా ప్రయోజనం చేకూర్చగలరో పరిశీలిస్తారు. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత యూఏఈ అధికారులు గోల్డెన్ వీసాను జారీ చేస్తారు.


నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాను యూఏఈ ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ వాసులకు అందిస్తుండగా.. ఈ ఫలితాల ఆధారంగా త్వరలో చైనా, ఇతర దేశాలకు కూడా దీన్ని విస్తరించే యోచనలో ఉంది.


యూఏఈ గోల్డెన్ వీసాతో భారత్‌పై ఎలాంటి ప్రభావం?


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులు, పెట్టుబడిదారులు, నిపుణులను ఆకర్షించడానికి ‘గోల్డెన్ వీసా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత్‌లో ధనవంతులతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన చాలా మంది ఇప్పటికే విదేశాలకు వలస వెళ్తున్నారు. యూఏఈ గోల్డెన్ వీసా లాంటి అవకాశాలు ఈ వలసలను మరింత పెంచుతాయి. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే. యూఏఈ గోల్డెన్ వీసాతో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడే ప్రభావం కింది విధాలుగా ఉండవచ్చు..


పెట్టుబడుల తరలింపు:


ధనవంతులు, అధిక నికర విలువ కలిగిన భారతీయులు పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక స్థిరత్వం కోసం యూఏఈలో పెట్టుబడులు పెట్టడానికి మరింత ఆసక్తి చూపవచ్చు. అంతిమంగా ఇది భారత్ నుంచి కొంతమేరకు పెట్టుబడుల తరలింపుకు దారితీస్తుంది. యూఏఈలో వ్యక్తిగత ఆదాయపు పన్ను, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వారసత్వ పన్ను లేకపోవడం.. ఇప్పటికే భారతీయ పెట్టుబడిదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది.


నైపుణ్యాల తరలింపు:


మంచి నైపుణ్యాలు కలిగిన నిపుణులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, సాంకేతిక నిపుణులు యూఏఈలో మెరుగైన అవకాశాలు, పన్ను రహిత ఆదాయం, లగ్జరీ లైఫ్ కోసం వెళ్లవచ్చు. ఇది మన దేశంలో పలు రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతకు దారితీయవచ్చు.


విదేశీ మారక ద్రవ్యం - రెమిటెన్స్‌:


గోల్డెన్ వీసా పొందిన భారతీయులు యూఏఈలో స్థిరపడితే, వారి ఆదాయంలో కొంత భాగం భారతదేశానికి రెమిటెన్స్‌ల రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే, పెట్టుబడులు పెద్ద మొత్తంలో తరలిపోతే, నికర ప్రభావం ప్రతికూలంగా ఉండవచ్చు.


ద్వైపాక్షిక సంబంధాలు:


ఇది భారతదేశం - యూఏఈ మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది. నామినేషన్ ఆధారిత వీసా ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లకు యూఏఈ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది.


రియల్ ఎస్టేట్ మార్కెట్‌ ప్రభావం:


భారతదేశంలో కొంత మంది ధనవంతులు తమ ఆస్తులను యూఏఈలో పెట్టుబడిగా పెట్టడానికి మొగ్గు చూపించే అవకాశం ఉంది. అంతిమంగా ఇది భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం చూపించవచ్చు. అయితే, లగ్జరీ ఆస్తుల విషయంలో ఈ ప్రభావం పడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa