ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను కాడెద్దుల్లా నాగలికి కట్టి.. వారితో పొలం దున్నించారు. వారిని హింసిస్తూ.. కర్రలతో కొడుతూ దారుణంగా వ్యవహరించారు. ఆ ప్రేమ జంట చేసిన నేరమల్లా సాంఘిక కట్టుబాట్లను ఉల్లంఘించి పెళ్లిచేసుకోవడమే. ఈ అనాగరిక ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో చోటుచేసుకుంది. కంజామఝిరా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కంజామఝిరా గ్రామానికి చెందిన యువకుడు.. తన అత్త కూతుర్ని ప్రేమించాడు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ గ్రామంలోని ఆచారం ప్రకారం.. అత్త వరుస అయ్యే వారి కూతుళ్లను పెళ్లి చేసుకోరాదు.
కానీ, గ్రామ సంప్రదాయాలకు విరుద్ధంగా ఆ జంట పెళ్లి చేసుకోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని శిక్షించాలని నిర్ణయించిన పంచాయితీ.. ఆ జంటను ఎద్దుల్లా నాగలికి కట్టి పొలం దున్నించారు. కర్రలతో కొడుతూ.. హింసించారు.. పొలం దున్నించిన అనంతరం వారిని గ్రామంలోని గుడికి తీసుకెళ్లి శుద్ధి కర్మలు చేయించారు.
‘‘మానవత్వానికి మాయమచ్చలాంటి ఈ ఘటనపై దృష్టిపెట్టండి.. గ్రామ సంప్రదాయాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారనే కారణంతో ఒక జంటను గ్రామస్థులు చుట్టుముట్టి అమానవీయంగా అవమానించారు. శారీరకంగా, మానసికంగా వేధించారు.. శుద్ధిక్రియలతో దుర్మార్గంగా వ్యవహరించారు.. ఇది దేశ రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన చర్య.. వీరిపై చర్యలు తీసుకోండి’’ అని కోరుతూ ఓ సామాజిక ఉద్యమకారుడు ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసి.. ఒడిశా సీఎంఓ, జాతీయ మానవహక్కుల కమిషన్, రాయగడ పోలీసులను ట్యాగ్ చేశాడు.
తాలిబన్ తరహా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని రాయగడ పోలీసులు తెలిపారు. గ్రామస్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. అయితే, తక్షణమే ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాజ్యాంగ, మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాయగడ జిల్లా ఎస్పీ స్వాతి కుమార్ ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. కానీ, ఈ విషయాన్ని పలు కోణాల్లో సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, ఈ ఏడాది జనవరిలోనూ రాయగడ జిల్లాలో ఇదే తరహా సంఘటన చోటుచేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకుందని యువతిని గుడికి తీసుకెళ్లిన 40 మంది కుటుంబసభ్యులు.. శుద్ధి కర్మల పేరుతో ఆమెకు గుండు గీయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa