‘‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వ్యవస్థ అమలులో కేంద్ర ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేఎస్ ఖేర్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీకి) స్పష్టంగా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 129 రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలు (సవరణ) బిల్లు 2024 పరిశీల కోసం ఏర్పాటుచేసిన జేపీసీ సమావేశంలో తమ అభిప్రాయాలను పంచుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తులు.. జమిలీ ఎన్నికలపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. జమిలీ ఎన్నికల బిల్లుపై వేసిన జేపీసీకి బీజేపీ ఎంపీ పీవీ చౌదరి ఛైర్మన్‌గా ఉన్నారు.
‘‘ఈసీకి రాజ్యాంగ సవరణల ద్వారా విస్తృత అధికారం ఇవ్వడం ప్రమాదకరం.. ఎన్నికల నిర్వహణలో ఒక 'ఓవర్‌సైట్ మెకానిజం' అవసరం.. చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థ ఉండాలి.. నిబంధనలకు తూట్లు పొడవరాదు’’ అని ఇరువురూ పేర్కొన్నారు. మాజీ సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఇదే విషయంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ‘‘ఒక ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉండే హక్కును ఏ పరిస్థితుల్లోనూ తగ్గించరాదు. అంతకంటే తక్కువ వ్యవధిలో ప్రాజెక్టులు ప్రారంభించడానికీ, సుపరిపాలనకు అవకాశాలూ లేకుండా పోతాయి’’ అని జస్టిస్ చంద్రచూడ్ , జస్టిస్ ఖేర్ సూచించారు.
కాగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్నికలు తరచుగా జరిగితే, పాలన అస్తవ్యస్తమవుతుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ అంశాలపై స్పందించిన కమిటీ చైర్మన్ పీ.పీ. చౌదరి ‘‘బిల్లులో మార్పులు అవసరమని భావిస్తే, మేము మార్చుతాం. దేశ ప్రయోజనం కోసం నివేదికను సిద్ధం చేస్తాం. రాజ్యాంగ బలపరిచే విధంగా పని చేస్తాం.’’ అని చెప్పారు. అలాగే, ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు అనేది దేశ నిర్మాణానికి అవసరం. ఇది వచ్చే శతాబ్దాల వరకు కొనసాగే విధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి’’ అని అన్నారు.
ఇప్పటివరకు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యూ.యూ.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్,జస్టిస్ జెఎస్ ఖేర్ లాంటి న్యాయమూర్తుల అభిప్రాయాలను సేకరించింది. గురువారం జరిగిన సమావేశం ఎనిమిదోది. ప్రతిపక్ష పార్టీ నేతలు.. ఈ బిల్లు రాజ్యాంగ మౌలికసూత్రాన్ని ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడుతున్నా, కమిటీ ముందు హాజరైన న్యాయవేత్తలు దాన్ని ఖండించారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ జమిలీ ఎన్నికలపై చేసిన సూచనలతో కేంద్రం బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఒకే ఎన్నికల విధానంపై చట్ట సవరణలు జరుగుతున్న వేళ, దేశ ప్రధాన న్యాయమూర్తుల సూచనలు అత్యంత కీలకం. ఇది ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత, ప్రజాస్వామ్య స్థిరత్వం, రాజ్యాంగ నిబద్ధతకు సంబంధించిన వ్యవహారం కావడంతో అధికార విభజనలో సమతౌల్యత అవసరమన్న భావన బలపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa