జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన దారుణమైన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తంగా 26 మంది అమాయక పౌరులు ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ దాడి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కలిసి పన్నిన కుట్ర అని తాజాగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దాడిని పాకిస్థాన్ రాజకీయ, సైనిక ఉన్నతాధికారుల ప్రత్యక్ష ఆదేశాల మేరకు అమలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడిని 26/11 ముంబై దాడుల మాదిరిగానే ఐఎస్ఐ-ఎల్‌ఈటీ సంయుక్త పథకంగా వర్ణించారు. సంపూర్ణ గోప్యతను పాటించేందుకు.. ఈ కుట్రలో కాశ్మీరీ ఉగ్రవాదులు ఎవరినీ చేర్చుకోలేదని నివేదిక పేర్కొంది. బదులుగా కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్‌ఈటీకి చెందిన విదేశీ (పాకిస్థానీ) ఉగ్రవాదులను మాత్రమే పహల్గామ్‌లోని బైసరన్ లోయలో దారుణమైన లక్ష్య హత్యలు చేసేందుకు ఆదేశించారు. ఎల్‌ఈటీ కమాండర్ సాజిద్ జుట్‌కు ఐఎస్‌ఐ ఈ మేరకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిందని తెలిసింది.
అలాగే పహల్గామ్ దాడి బృందానికి సులేమాన్ అనే వ్యక్తి నాయకత్వం వహించాడు. ఇతడు పాకిస్థాన్ ప్రత్యేక దళాల మాజీ కమాండో అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 2022లో నియంత్రణ రేఖ (LoC) దాటడానికి ముందు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఎల్‌ఈటీ మురిద్కే కేంద్రంలో సులేమాన్ శిక్షణ పొందాడు. అతనితో పాటు మరో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు కూడా ఈ దాడికి పాల్పడ్డారు. ఏప్రిల్ 15వ తేదీన సులేమాన్.. త్రాల్ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు శాటిలైట్ ఫోన్ విశ్లేషణ ద్వారా వెల్లడైంది.
అంటే దాడికి దాదాపు ఒక వారం ముందు నుంచే అతను బైసరన్ సమీపంలో ఉన్నాడని స్పష్టం అవుతోంది. సులేమాన్ 2023 ఏప్రిల్‌లో పూంచ్ వద్ద జరిగిన ఆర్మీ ట్రక్ దాడిలో కూడా పాల్గొన్నాడు. ఆ దాడిలో మొత్తంగా ఐదుగురు సైనికులు మరణించారు. అయితే పహల్గామ్ దాడికి ముందు రెండేళ్లు అతడు అండర్ గ్రౌండ్‍కు వెళ్లిపోయాడు.
ఈ దారుణమైన హత్యల్లో పాల్గొన్న మరో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదుల గుర్తింపును అధికారులు వెల్లడించలేదు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు గతంలో పాకిస్థానీ ఉగ్రవాదులు హాషిమ్ మూసా, అలీ భాయ్‌ల పాత్రను అనుమానించినప్పటికీ.. ప్రస్తుత విచారణ సులేమాన్ పాత్రను మాత్రమే ధృవీకరించింది. దాడికి సహకరించిన స్థానిక కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ పాత్రకు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ దారుణమైన దాడిలో ఏ స్థానిక ఉగ్రవాది పాల్గొనలేదని చెప్పారు. లేదంటే ఈ ఉగ్రవాద కుట్రకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు వారికి తెలియవని అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
గత నెలలో ఈ కేసులో అరెస్టయిన పర్వేజ్ అహ్మద్ జోతర్, బషీర్ అహ్మద్ జోతర్‌లకు కూడా పరిమిత పాత్ర మాత్రమే ఉందని.. వారు పాకిస్థానీ ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం, ఇతర లాజిస్టిక్ సహాయాన్ని కొన్ని వేల రూపాయలకు బదులుగా అందించినట్లు భావిస్తున్నారు. బైసరన్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదుల ప్రణాళిక గురించి తమకు తెలియదని వారు కూడా ఖండించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa