ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడిచిన ఐదేళ్లలోనే 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు..: డీజీసీఏ సంచలన నివేదిక

national |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 08:07 PM

భారత విమానయాన రంగం భద్రతపై ఆందోళనలను పెంచుతూ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఓ నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా ఇటీవలే జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో పాటు గత ఐదేళ్లలో దేశీయ గగనతలంలో మొత్తం 65 ఇన్-ఫ్లైట్ ఇంజిన్ షట్‌డౌన్‌లు (విమానం గాలిలో ఉండగా ఇంజిన్ ఆగిపోవడం) నమోదైనట్లు డీజీసీఏ డేటా స్పష్టం చేసింది. అంతేకాకుండా 2024 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు కేవలం 17 నెలల వ్యవధిలోనే విమానాల నుంచి 11 'మేడే' కాల్స్ (ఆపద సంకేతాలు)వచ్చినట్లు వెల్లడించింది.


ఈ గణాంకాలు చూస్తుంటేనే దేశంలోని విమానయాన భద్రతపై.. మరిన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లోనే 65 ఇంజిన్ వైఫల్యాలు నమోదు అయ్యాయంటే.. సగటున నెలకు ఒక ఇంజిన్ పని చేయకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇది విమాన ప్రయాణికుల భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశంగా నిలుస్తుండగా.. ఇంజిన్ షట్‌డౌన్‌లు విమానానికి కీలకమైన శక్తిని కోల్పోవడాన్ని సూచిస్తాయి. ఇలా జరిగినప్పుడు పైలెట్లు.. అత్యవసర ల్యాండింగ్‌లు, ఇతర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుంది.


 17 నెలల్లోనే 11 'మేడే' కాల్స్..


'మేడే' కాల్స్ అనేవి విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉందని, తక్షణ సహాయం అవసరమని సూచించే అంతర్జాతీయ అత్యవసర సంకేతాలు. అయితే భారత దేశ గగనతలంలో మొత్తంగా 17 నెలల వ్యవధిలోనే 11 మేడే కాల్స్ నమోదు కావడం గమనార్హం. ఇవి విమానాలు తరచుగా తీవ్రమైన సాంకేతిక లోపాలతో లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలియజేస్తుంది. ఈ కాల్స్ ఇంజిన్ వైఫల్యాలు, నియంత్రణ కోల్పోవడం, ఇతర సిస్టమ్ వైఫల్యాల వల్ల సంభవించి ఉండవచ్చు. కానీ అదృష్టవశాత్తు ఇవన్నీ.. పైలట్‌ల నైపుణ్యంతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సహకారంతో ప్రమాదాలను నివారించాయి.


ఈ గణాంకాలు కేవలం ఒక్క ఎయిర్ ఇండియా ప్రమాదానికే పరిమితం కాకుండా భారత విమానయాన రంగంలో ఉన్న విస్తృతమైన సాంకేతిక, నిర్వహణ లోపాలను బట్టబయలు చేస్తున్నాయి. విమాన ఇంజిన్ల నిర్వహణ, భాగాల నాణ్యత, ఎయిర్‌లైన్స్‌లో భద్రతా ప్రోటోకాల్స్‌ను పటిష్టంగా పాటించడం వంటి అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ డేటా స్పష్టం చేస్తోంది. డీజీసీఏ ఈ డేటాను వెల్లడించడం ద్వారా భద్రతా ప్రమాణాలను మెరుగు పరచడానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే అన్నింటికంటే ముఖ్యం కాబట్టి.. ఈ నివేదికపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విమానయాన నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa