ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాంచెస్టర్ వేదికగా జరగనున్న టెస్టు మ్యాచ్‌.. భారత్ ఇక్కడ గెలిస్తే రికార్డే

sports |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 11:21 PM

ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ముగిసే సరికి భారత్ 1-2తో వెనకబడి పోయింది. తొలి మ్యాచ్‌లో, మూడో మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. దీంతో ప్రస్తుతం టీమిండియాపై ఒత్తిడి నెలకొంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్ కోల్పోనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి.. సిరీస్‌ను 2-2తో సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌ జులై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా జరగనుంది. ఇప్పటికే గిల్ సారథ్యంలోని భారత్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తోంది.


మాంచెస్టర్‌లో టీమిండియా టెస్ట్ రికార్డ్‌ భయపెడుతోంది. ఎందుకంటే ఈ వేదికన భారత్ ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అందులో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ భారత్ గెలవలేదు. ఈ స్టేడియంలో టెస్ట్‌లలో గెలుపు రుచిని చూడలేదు. ఇక్కడ జరిగిన 9 టెస్ట్‌లలో నాలుగింట్లో ఇంగ్లాండ్ గెలిచింది. మరో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి.


1936లో భారత్ తొలిసారి మాంచెస్టర్‌లో టెస్ట్ మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్ డ్రా అయింది. 1946లోనూ ఫలితం తేలలేదు. 1952, 1959లో మాత్రం ఇంగ్లాండ్ విజయం సాధించింది. 1971లోనూ మ్యాచ్ డ్రా అయింది. 1974లో మళ్లీ ఇంగ్లాండ్ గెలిచింది. ఆ తర్వాత 1982, 1990లో మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. చివరగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లో 2014లో మ్యాచ్ జరిగింది. అందులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌, 54 పరుగుల తేడాతో టీమిండియాపై గెలుపొందింది.


మొత్తంగా ఈ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 84 టెస్టుల్లో ఆతిథ్య జట్టు 33 మ్యాచ్‌లలో గెలిచింది. 15 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. మిగిలిన 36 మ్యాచ్‌లు మాత్రం డ్రా అయ్యాయి. ఈ స్టేడియంలో భారత జట్టు అత్యధిక స్కోర్ 390 పరుగులుగా ఉంది. ర‌వీంద్ర జ‌డేజా, కేఎల్ రాహుల్ మిన‌హా టీమిండియా టెస్ట్‌ జట్టులోని ఏ ఆటగాడు కూడా ఇక్కడ టెస్ట్‌ మ్యాచ్ ఆడలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa