ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో వాణిజ్యంలో చైనా లాంటి తప్పులను రిపీట్ కానివ్వం.. అమెరికా

national |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 07:25 PM

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'అమెరికా ఫస్ట్' నినాదం దేశీయ, విదేశాంగ విధానాలలో అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం. అయితే, ఈ విధానంపై అమెరికన్ల మధ్యే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ముప్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన ప్రపంచ క్రమంలో అమెరికన్ల మధ్య ఇది విభజన సృష్టించింది. అయినప్పటికీ ఈ ఏడాది జనవరిలో వెనుజులాపై దాడి సహా ప్రపంచ వాణిజ్యం, భౌగోళిక రాజకీయాలపై జరిగే చర్చల్లో కీలక అంశంగా మారింది. ఈ వారం ఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్‌లో అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి క్రిస్టోఫర్ లాండౌ ఆ విషయాన్ని నొక్కిచెప్పారు.


భారత్, అమెరికా మధ్య గత నెల కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ చర్చలు అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదానికి ప్రాధాన్యత ఇస్తూ.. అమెరికా ప్రయోజనాలను కాపాడేలా రూపొందిద్దుకుందని ఆయన పేర్కొన్నారు.


అంతేకాదు, గతంలోనే చైనాతో కొనసాగిన వాణిజ్య సంబంధాల నుంచి అమెరికా పాఠాలను నేర్చుకుందని ఆ దేశ విదేశాంగ సహాయ మంత్రి తెలిపారు. అప్పట్లో ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనాకు సభ్యత్వం విషయంలో తాము మద్దతు ఇచ్చామని, తద్వారా అమెరికా కంపెనీలకు భారీ మార్కెట్, సమర్దవంతమైన సప్లమ్ ఛైన్ మార్కెట్ లభిస్తాయని భావించామని లాండౌ తెలిపారు. కానీ, చివరకు హ్యాండ్ ఇచ్చిందని ఆరోపించారు.


ఇక్కడ భారత్ ఒక విషయం అర్ధం చేసుకోవాలి.. 20 ఏళ్ల కిందట చైనాతో చేసిన పొరపాట్లను న్యూఢిల్లీ విషయంలో పునరావృతం కానీయబోమని ఉద్ఘాటించారు. ‘మార్కెట్లను మీరు పెంచుకోండని అనుమతించి.. తర్వాత వాణిజ్య రంగంలో మమ్మల్ని తొక్కేయడం జీర్ణించుకోలేం.. మేము చేసుకునే ప్రతి ఒప్పందంలో అమెరికన్ల ప్రయోజనాలనే చూసుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. ‘మాతో వాణిజ్యం చేయండి కానీ.. మా నిబంధనలు ప్రకారమే’ అనేది ఆయన వ్యాఖ్యల అంతరార్థం.


అయితే, ‘అమెరికా ఫస్ట్’ అంటే తాము ఒంటరిగా ఉండటం కాదని, ఇతర దేశాల సహకారంతో లక్ష్యాలను సాధించడమని పేర్కొన్నారు. ‘అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలని ట్రంప్ అనుకున్నట్టుగానే.. భారత ప్రధాన మంత్రి లేదా ఇతర ప్రపంచ నేతలు తమ దేశాలను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని భావించడం సహజమే’ అని క్రిస్టోఫర్ లౌండౌ పేర్కొన్నారు.


లౌండౌ వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలనలో అమెరికా విదేశాంగ విధానంలో జరుగుతోన్న మార్పులను సూచిస్తున్నాయి. ముఖ్యంగా టారీఫ్‌లను ఆయుధంగా చేసుకుని సమాన పోటీ పరిస్థితి ఉండే దేశాలతో ప్రత్యేక వాణిజ్య వర్గాన్ని ఏర్పాటుచేయాలనే అమెరికా ఆలోచనను ప్రతిబింబిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa