శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామితో దాడిచేసి ముంచేసిన ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తొలిసారి స్పందించారు. ఢిల్లీలోని రైసినా డైలాగ్‌లో జైశంకర్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మిలాన్ 2026కు వచ్చిన పలు ఇరాన్ యుద్ధ నౌకలు అనుకోకుండా యుద్ధ ప్రభావానికి గురయ్యాయని ఆయన అన్నారు. ఆ నౌకలు యుద్ధంలో పాల్గొనడానికి రాకున్నా.. ఉద్రిక్తతల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే తిరిగి వెళ్తుండగా ఐరిస్ లావన్ అనే మరో నౌకలో సాంకేతిక సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.
దీంతో కొచ్చి తీరంలో అత్యవసర డాకింగ్‌ను అనుమతించాలని ఇరాన్ విజ్ఞప్తి చేసిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఐరిస్ డేనాపై దాడికి ముందే ఇది జరిగినట్టు ఆయన వివరించారు. ఈ అంశంలో చట్టపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ.. మానవతా దృక్పథంతోనే మార్చి 1న సంబంధిత అనుమతులను భారత్ మంజూరు చేయడంతో ఈ నెల 4న లావాన్‌ను కొచ్చిలో ఇరాన్ నిలిపిందని ఆయన వెల్లడించారు. అందులోని 183 మంది సిబ్బందికి కొచ్చిలోనే ఆశ్రయం కల్పించామని, భారత్ సరైన నిర్ణయమే తీసుకుందని జైశంకర్ స్పష్టం చేశారు.
అలాగే, హిందూ మహాసముద్రంలో దాడికి గురైన ఐరిస్ డేనా ఇరాన్ యుద్ధ నౌక నుంచి తొలుత శ్రీలంక నేవీకి ప్రమాద హెచ్చరిక వచ్చిందని తెలిపారు. ఇండియన్ నేవీ సైతం సహాయక చర్యల్లో పాల్గొందని తెలిపారు. దీనిపై నేవీ ఇప్పటికే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తమకు బుధవారం ఉదయం (మార్చి 4న) శ్రీలంక మారిటైమ్ రెస్క్యూ కో-ఆర్డినేషన్ కేంద్రం నుంచి ప్రమాద అలర్ట్ రావడంతో స్పందించినట్టు పేర్కొంది.
తొలుత లాంగ్-రేంజ్ మెరైన్ పెట్రోలింగ్ విమానం పంపిన నేవీ... ఎయిర్-డ్రాపబుల్ లైఫ్ రాఫ్ట్‌లతో కూడిన రెండో విమానాన్ని కూడా సిద్ధం చేసింది. ఐఎన్ఎస్ తరంగిణి నౌక ఆ రోజు సాయంత్రం అక్కడకు చేరుకోగా.. తర్వాత కొచ్చి నుంచి ఐఎన్ఎస్ ఇక్షక్ బయలుదేరి వెళ్లింది. ఐరిస్ డేనా ఘటనలో 150 మందికిపైగా నావికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మందిని శ్రీలంక నేవీ రక్షించింది. అలాగే, మరో యుద్ధ విమానం ఐరిస్ బుష్‌హర్ శ్రీలంకలో ఇంజిన్ లోపం కారణంగా నిలిచిపోయింది. అందులోని 180 మంది సిబ్బందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించి, కొలంబోకు తరలించాయి. ప్రస్తుతం వీరిని ఇరాన్‌కు పంపొద్దని శ్రీలంకపై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్టు సంబంధిత అధికార వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్ నివేదించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa