ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూ.2,200 కోట్లతో, రెండు జిల్లాల ప్రజల ఎన్నో ఏళ్ల కల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 07:51 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రైల్వే లైన్‌ పనుల్ని వేగవంతం చేసింది. కొత్త ప్రాజెక్టులతో పాటుగా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవాటిని కూడా పట్టాలెక్కిస్తున్నారు. గోదావరి ప్రాంతవాసుల ఎన్నో ఏళ్ల కలగా ఉన్న కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పనులు వేగవంతం చేస్తన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం రూరల్‌, యలమంచిలి మండలాల్లోని గ్రామాల మీదుగా ఈ రైల్వే లైన్ వెళుతోంది. ఈ మేరకు భూమిని సేకరించి పరిహారం కూడా చెల్లించారు. ఈ రైలు మార్గం కోసం సేకరించిన భూమిలో


స్తంభాలను పాతుతున్నారు.. హద్దుల కోసం ఇలా చేస్తున్నారు. అధికారులు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 53, యలమంచిలి మండలంలో 66 ఎకరాలు ఉంది. ఆయా గ్రామాల్లో అవసరైమన భూమిని సేకరించి.. ట్రాక్ వేయడం కోసం స్తంభాలను పాతారు. స్టేషన్‌కు చినమామిడిపల్లి కాల్వకు అవతల వైపు హద్దులు వేశారు.. అంతేకాదు పాలకొల్లు రోడ్‌లో ఈ కొత్త రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా కాలువపై బ్రిడ్జి కూడా రానుంది.


పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి విజయవాడకు రైల్వే ట్రాక్‌‌ అందుబాటులో ఉంది. ఇప్పుడు కోటిపల్లి నుంచి నరసాపురంల మధ్య కొత్తగా రైల్వే పనులు చేపట్టారు. ఈ రూట్‌లో అవసరమైన చోట్ల వంతెనల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ రైల్వే లైన్‌లో స్టేషన్లు ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కొత్త రైల్వేలైన్‌ అందుబాటులోకి వస్తే నరసాపురం కూడా పెద్ద జంక్షన్‌గా మారుతుందని చెబుతున్నారు. నరసాపురం రైల్వే స్టేషన్‌ను అమృత్‌ భారత్‌ పథకం కింద రూ.30 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇటు కోటిపల్లి రైల్వే లైన్ పనుల్ని కూడా మరింత వేగవంతం చేశారు.


కోనసీమ జిల్లాలోని కోటిపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వరకు రూ.2,200 కోట్ల అంచనాతో 57.81 కి.మీ. రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. మొత్తం 8 మండలాలు, 25 గ్రామాల మీదుగా ఈ రైల్వే ప్రాజెక్టు చేపట్టారు. అయితే అలైన్‌మెంట్‌పై కొందరు కోర్టుకు వెళ్లడంతో.. స్టే విధించారు. ఇటీవల ఆ స్టేను ఎత్తివేయడంతో మళ్లీ భూసేకరణను వేగవంతం చేశారు. కోనసీమ వాసులు రైలు ఎక్కాలంటే రాజమహేంద్రవరమో, కాకినాడో వెళ్లాల్సి వచ్చేది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆ ఇబ్బంది తొలగిపోతుంది అంటున్నారు. అన్నీ కుదిరితే మరో మూడేళ్లలో కోనసీమలో రైలు కూత వినిపిస్తుందని భావిస్తున్నారు. ఈ కోటిపల్లి రైల్వే లైన్ పనుల్ని వేగవంతం చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. కోనసీమ వాసులకు ఈ రైల్వే లైన్ ఓ కలగా మిగిలింది. ఎన్నో ఏళ్లుగా ఈ రైల్వే లైన్ కోసం ఎదురు చూస్తున్నారు.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa