తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య గమనిక. ఈ ఏడాది సూర్యుడి ప్రతాపం తీవ్రంగా ఉండనుంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కానున్నాయి. అలాగే వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉంటుందని.. ఇదే సమయంలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తన్నాయి. జూన్ నెలలో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో పగటి పూట ఉష్ణోగ్రతలు ఏకంగా 48 నుంచి 49 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉండొచ్చని చెప్తున్నాయి. జూన్‌లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.
మరోవైపు భానుడి ప్రతాపం ఇప్పటికే మొదలైపోయింది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో భారత వాతావరణ విభాగం ఇప్పటికే పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచించింది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని.. డీహైడ్రేషన్ బారిన పడకుండా ద్రవపదార్థాలు తీసుకుంటూ ఉండాలని సూచించింది.
మరోవైపు మే నెలలో ఎల్‌నినో ఏర్పడుతుందని.. ఆగస్ట్ నాటికి బలపడుతుందని ECMWF ( European Centre for Medium Range Weather Forecasts) అంచనా వేసింది. ఆగస్ట్ నెలలో సూపర్ ఎల్‌నినో ఏర్పడే అవకాశం 22 శాతం ఉందని.. స్ట్రాంగ్ ఎల్‌నినో ఏర్పడటానికి 80 శాతం, మోస్తరు ఎల్‌నినో ఏర్పడేందుకు 98 శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. అటు మార్చి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అంచనా వేసింది.
ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరతాయని.. వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మార్చిలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచేందుకు ఛాన్స్ ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ఎండలు. వడగాలుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa