శాసనసభ ఎన్నికలకు మరి కొద్ది రోజుల్లో షెడ్యూల్ వెలువడనుండగా.. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై.. ఉద్యోగాలు లేనివారికి నిరుద్యోగ భృతి ప్రకటించారు. ‘యువ సాథి పథకం’ కింద ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 అందించనున్నట్లు దీదీ తెలిపారు. ఈ డబ్బులు శనివారం నిరుద్యోగుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు వెల్లడించారు. 21 నుంచి 40 ఏళ్లలోపు వారే ఈ పథకానికి అర్హులని మమతా బెనర్జీ చెప్పారు. ప్రభుత్వం అందించే ఈ సాయంతో స్వయంసమృద్ధి భవిష్యత్తువైపు పయనించగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా కోల్‌కతాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ... ముందు ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయాలని భావించామని, కానీ, మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. తమ హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 40 శాతం మేర తగ్గిందని సీఎం తెలిపారు. దాదాపు 40 లక్షల మందికి యువతకు ప్రభుత్వం నైపుణ్య శిక్షణ అందించిందని.. వీరిలో 10 లక్షల మంది ఇప్పటికే వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉపాధి పొందుతున్నారని ఆమె తెలిపారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికే ఏడాదికి రూ.10 వేలు వారికి అందజేస్తున్నామని వివరించారు. గతంలో భూమి ఉన్న రైతులకు రూ.4 వేలు ఇచ్చామని, ఇప్పుడు భూమిలేని వారికి కూడా రూ.4 వేలు చొప్పున అందజేయనున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే, బెంగాల్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు అనేక ఐటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇదే సమయంలో పశ్చిమ్ బెంగాల్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన ఆర్ఎన్ రవికి మమతా తనదైన స్టయిల్‌లో వార్నింగ్ ఇచ్చారు. తమిళనాడులో వ్యవహరించినట్టు బెంగాల్‌లో చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న రవిని.. కేంద్రం బెంగాల్‌కు పంపింది. తమిళనాడులో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా గవర్నర్ తీరును తప్పుబట్టింది. సీవీ ఆనంద్ బోస్‌తో బలవంతంగా రాజీనామా చేయించి... బీజేపీ ‘క్యాడర్’ ఆర్ఎన్ రవిని నియమించారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపుపై మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనిపై కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ఆమె పిలుపు నిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa