కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడి దర్శనం కోసం వస్తున్న భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించాలని భావిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 3 నిర్మాణం కోసం సాధ్యసాధ్యాల పరిశీలనకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అలాగే శ్రీవారి భక్తుల కోసం తిరుమలలో పలు ప్రాంతాలలో వసతులతో కూడిన విశ్రాంతి కేంద్రాలు (లాంజ్‌లు) ఏర్పాటు చేయటంపై టీటీడీ పాలకమండలి చర్చించింది. తిరుమలలో లాంజ్‌ల ఏర్పాటు కోసం ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో తిరుమల కొండకు నడిచి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మౌలిక వసతులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని.. భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం పెంపొందించాలని నిర్ణయించారు.ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించారు.
తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందుకోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈ సబ్ కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
అలాగే తిరుమలలో 4 కోఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుమల భక్తులు సైబర్ మోసాలకు గురి కాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కళ్యాణకట్టలోమరింత మెరుగైన సౌకర్యాలు, పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా తిరుమలలో నూతన పరిపాలన భవనం నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది.
తిరుమలలో పాత బడిన బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, హెచ్వీడీసీలోని ఆరు బ్లాకులు, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని తొలగించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అన్నమయ్య స్వస్థలం తాళ్లపాకలో అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళిక, ఇటీవల నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు ఉచితంగా మైక్ సెట్ల పంపిణీ, నిరుద్యోగులైన వేద పారాయణదారులకు.. నిరుద్యోగ భృతికి గానూ రూ.2.16 కోట్ల నిధులు మంజూరుకు పాలకమండలి ఆమోదం తెలిపింది.
శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు 3 కేటగిరీలుగా నిధులు చెల్లించనున్నారు, రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా నిధులు చెల్లించనున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదం కోసం పంపించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa