వానాకాలం వచ్చిందంటే ఈగల బెడద పెరిగిపోతుంది. ఇంటి నిండా అవి ముసురుకుంటాయి. మరి వీటిని వెళ్లగొట్టాలంటే అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కాలలో ఏది ట్రై చేసినా సింపుల్ గా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ఇంటి నిండా ముసురుతున్న ఈగల్ని తరిమికొట్టే చిట్కాలు, చెప్పినట్టు చేస్తే మళ్లీ రానే రావు
వర్షాకాలంలో ఈగలతో మహా చిరాకు పుడుతుంది. ఇంటి నిండా ముసురుతూనే ఉంటాయి. ఎన్ని సార్లు వెళ్లగొట్టినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. దోమలు అయితే చేతులతో చంపడమో లేదా మస్కిటో కాయిల్స్ పెట్టడమో లాంటివి చేయవచ్చు. సులువుగానే వీటిని బయటకు పంపవచ్చు. కానీ ఈగల విషయంలో ఇలా కాదు. అంత సులభంగా వీటిని వెళ్లగొట్టలేం. పైగా వీటిని పట్టుకుని చంపడం కూడా కుదరదు. వానాకాలం అయితే వీటి సంఖ్య మరింత పెరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ వాలుతూ ఇబ్బంది పెడతాయి. నిత్యం చెవుల చుట్టూ తిరుగుతూ చిరాకు తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు పాటిస్తే ఇక ఈగలు ఇంట్లోకి రానే రావు. ఇంట్లో దొరికే పదార్థాలతోనే సులువుగా ఈగల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.
యాపిల్ సైడర్ వెనిగర్
ఈగలు రకరకాలుంటాయి. కొన్ని డ్రైనేజ్ పై వాలుతుంటాయి. ఇంకొన్ని ఇంట్లో ఉండే పండ్లు, ఆహార పదార్థాలపై వాలుతుంటాయి. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఎక్కువ మొత్తంలో ఇంట్లోకి వచ్చేస్తాయి. అయితే..పండ్లపైన వాలే ఈగలను వెళ్లగొట్టాలంటే ఇప్పుడు చెప్పే ఓ సింపుల్ చిట్కా పాటించాలి. ముందుగా ఓ బౌల్ లో యాపిల్ సైడర్ వెనిగర్ పోయాలి. అందులో రెండు చుక్కలు డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. దానిపైన ఓ ప్లాస్టిక్ కవర్ వేయాలి. అయితే.. తప్పనిసరిగా ఈ కవర్ కి రంధ్రాలు ఉండేలా చూడాలి. ఓ రకంగా ఈగలను పట్టే ట్రాప్ లాంటిది ఇది. ఇంట్లో ఓ మూల ఈ బౌల్ పెట్టాలి. ఈగలు అందులో కవర్ పైన ఉండే రంధ్రాల నుంచి లోపలకు వెళ్తాయి. అందులో చిక్కుకుంటాయి. ఇక బయటకు రాలేవు. అయితే ఈ ఈగలు ఈ ట్రాప్ లో చిక్కుకోవాలంటే చెత్త బుట్టలు లేదా పండ్ల వద్ద బౌల్ ఉంచితే మంచిది.
బేకింగ్ సోడా
సింక్, బాత్ రూమ్ లోని డ్రైనేజ్ ల వద్ద వాలుతున్న ఈగలను వెళ్లగొట్టడం కూడా సులువే. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే మళ్లీ ఇంట్లోకి రానే రావు. ముందుగా అరకప్పు బేకింగ్ సోడా ఓ కప్పులో పోయాలి. అందులే అరకప్పు వైట్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని డ్రైన్స్ వద్ద పోయాలి. తరవాత అలాగే వదిలేయాలి. కాసేపటికి నురగ వస్తుంది. అలా వచ్చింది అంటే మిశ్రమం పని చేస్తోందని అర్థం. ఆ తరవాత వేడి నీళ్లు డ్రైన్ లో పోయాలి. ఇలా చేయడం వల్ల ఈగలు చనిపోతాయి. మళ్లీ అక్కడికి వచ్చేందుకు వీలుండదు. మరో రకంగా కూడా ఈగలను బయటకు పంపవచ్చు. ఇంట్లో పెంచుకునే మొక్కలపైన కూడా తరచూ ఈగలు వాలుతుంటాయి. మట్టిలో తేమ లేనప్పుడు దాల్చిన చెక్క పొడి లేదా వేపాకు నూనె నీటిలో కలిపి ఆకులపై స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఈగల లార్వా పూర్తిగా తొలగిపోతుంది.
మరో చిట్కా
నిమ్మతొక్కలను నీటిలో వేసి బాగా మరిగించాలి. కాసేపు వాటిని అలాగే ఉంచాలి. చల్లారిన తరవాత అందులో యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు వేయాలి. లేదా లవంగాల నూనె వేసినా సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఓ స్ప్రే బాటిల్ లో పోసి సింక్ లు, కిచెన్, చెత్త బుట్ట వద్ద స్ప్రే చేయాలి. ఇది మంచి పరిమళం ఇవ్వడమే కాకుండా ఈగలను బయటకు పంపించడంలో తోడ్పతుంది. మరో రకంగా కూడా ఈగల బెడద తప్పించవచ్చు.
కర్పూరం వెలిగించి ఈగలు ఎక్కువగా ఉన్న చోట ఉంచాలి. కర్పూరం నుంచి వచ్చే ఆ ఘాటు వాసన కారణంగా ఈగలు చాలా త్వరగా బయటకు వెళ్లిపోతాయి. అయితే..బెడ్ రూమ్స్, కిచెన్ లో ఈ చిట్కా పాటిస్తే మంచిది. తులసి ఆకుల చిట్కా కూడా ట్రై చేయవచ్చు. తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తరవాత నీటిని వడబోయాలి. ఈ మిశ్రమాన్ని ఓ స్ప్రే బాటిల్ లో ఉంచాలి. డస్ట్ బిన్స్, కిటికీల వద్ద స్ప్రే చేయాలి.
పెప్పర్ మింట్ చిట్కా
ఇంట్లో చాలా మంది రూమ్ స్ప్రే డిఫ్యూజర్స్ వాడుతుంటారు. ఇల్లంతా పరిమళం వచ్చేందుకు ఇవి వినియోగిస్తారు. అయితే..వీటిలో కేవలం పరిమళం ఇచ్చే లిక్విడ్స్ కాకుండా ఇప్పుడు చెప్పే మిశ్రమం కలిపితే సువాసనతో పాటు ఈగల బెడద తగ్గుతుంది. పెప్పర్ మింట్, లావెండర్ లేదా యూకలిప్టస్ ఆయిల్ మిక్స్ చేయాలి. వీటిని డిఫ్యూజర్ లో పోయాలి. ఇందులో నుంచి వచ్చే ఘాటు వాసనకు ఈగలు దెబ్బకు పారిపోతాయి. పైగా ఇల్లంతా మంచి పరిమళంతో నిండిపోతుంది. ఇక ఇంట్లో కిటికీలకు మెష్ లు పెట్టించుకోవడం కూడా ముఖ్యమే. ఎల్లో లైట్స్ వాడితే ఈగలు చాలా త్వరగా బయటకు వెళ్లిపోతాయి.
ఇంకో చిట్కా
ఈగలు రాకుండా ఉండాలంటే మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీ వాటర్ లీక్ అయినప్పుడు ఆ చోట ఎక్కువగా ఈగలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని తరచూ శుభ్రం చేయాలి. బకెట్ లో నీళ్లు పోసి వాటిని వాడకుండా అలాగే వదిలేస్తే చిన్న చిన్న ఈగలు ముసురుకుంటాయి. అందుకే బకెట్స్ ని ఖాళీ చేసి పక్కన పెట్టాలి. ఓ కప్పు నీరు తీసుకుని అందులో అరకప్పు వెనిగర్ వేయాలి. తరవాత ఓ పది చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ వేయాలి. చివర్లో ఓ టేబుల్ స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ కలపాలి. వీటన్నింటినీ మిక్స్ చేయాలి. తరచూ డస్ట్ బిన్స్, డ్రెైన్స్ వద్ద స్ప్రే చేస్తే చాలా సులువుగా ఈగలు బయటకు వెళ్లిపోతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa