ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జన్మతః పౌరసత్వం రద్దుకు కోర్టు బ్రేక్.. సంచలన తీర్పు వెనుక

international |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 09:49 PM

అగ్రరాజ్యం అమెరికాలో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఒక కీలక కార్యనిర్వాహక ఉత్తర్వుకు యూఎస్ 9వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ అడ్డుకట్ట వేసింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ఆదేశాన్ని కోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ముఖ్యంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. జన్మతః పౌరసత్వం రద్దుపై స్టే విధించింది. ఈ నిర్ణయం వలసదారులకు, ముఖ్యంగా స్వల్పకాలిక వీసాలపై అమెరికాలో ఉన్న వలసేతర తల్లిదండ్రులకు తెగ సంతోషాన్ని ఇస్తోంది. ముఖ్యంగా తమకు పుట్టిన పిల్లలకు పౌరసత్వం లభించే అవకాశం ఏర్పడిందని తెగ సంబుర పడిపోతున్నారు.


9వ అప్పీళ్ల సర్క్యూట్ కోర్టుకు చెందిన ముగ్గురు జడ్జీల కమిటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఈ అంశం అమెరికా సుప్రీం కోర్టు సమక్షానికి వచ్చే అవకాశం ఉంది. అక్రమంగా లేదా తాత్కాలికంగా వలస వచ్చిన జంటలకు అమెరికాలో జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వం అందించే విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం అమల్లోకి రాకుండా తాజా తీర్పు అడ్డుకుంటోంది. జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దు చేయడం ద్వారా ట్రంప్ యంత్రాంగం రాజకీయ ప్రయోజనం కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ముగ్గురు జడ్జీల కమిటీ తెలిపింది.


ఈ తీర్పు ట్రంప్ ఆదేశం అమలును దేశ వ్యాప్తంగా నిలిపి వేసింది. ట్రంప్ పరిపాలన జారీ చేసిన ఈ ఆదేశం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడమే కాకుండా.. అమెరికా పౌరసత్వానికి సంబంధించిన 14వ రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. దాదాపు 1868లో ఆమోదించబడిన 14వ రాజ్యాంగ సవరణ.. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా, అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా పౌరసత్వాన్ని ప్రసాదిస్తుంది. దీనికి చాలా తక్కువ మినహాయింపులు మాత్రమే ఉన్నాయి. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో.. ఆయా రాష్ట్రాల విదేశీయులకు, వలస ప్రజలకు తగిన ఉపశమనం అందించదని నిర్ధారించింది.


400 ఏళ్ల చరిత్ర.. ప్రపంచ ప్రసిద్ధి వెలంకణ్ణి మాత చర్చి గురించి తెలుసా?


ఈ తీర్పు వలస కుటుంబాలకు, ప్రత్యేకించి భారతీయ-అమెరికన్ కుటుంబాలకు గొప్ప ధైర్యాన్నిచ్చింది. అమెరికాలో జన్మించిన పిల్లలు 21 సంవత్సరాలు నిండిన తర్వాత తమ తల్లిదండ్రుల వలస స్థితిని మార్చడానికి దరఖాస్తు చేసుకునే ప్రస్తుత విధానాన్ని ఈ తీర్పు సమర్థించింది. ట్రంప్ పరిపాలన ఈ నిర్ణయాన్ని 9వ సర్క్యూట్ ప్యానెల్‌కు లేదా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి జన్మతః వచ్చే పౌరసత్వ హక్కులు అమెరికాలో చెక్కుచెదరవని ఈ తీర్పు స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa