ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షుగర్ రోగులకు చక్కెర కంటే బెల్లం మంచిదా

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 11:31 PM

ఈ రోజుల్లో డయాబెటిస్‌తో చాలా మంది బాధపడుతున్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అయితే, చాలా మంది డయాబెటిక్ పేషంట్లు చక్కెరను వాడటం మానేస్తారు. ఎందుకంటే ఇది షుగర్ లెవల్స్ పెంచుతుందని వారికి తెలుసు. అయితే, చక్కెర బదులు బెల్లం మంచిది అనుకోని.. దానిని వాడుతుంటారు. ఇప్పుడు మాత్రం కాదు.. మనం తాతల కాలం నుంచి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వింటూ వచ్చాం. డయాబెటిస్ పేషంట్లు కూడా చక్కెర కన్నా బెల్లమే బెస్ట్ అని నమ్ముతున్నారు. అయితే, ప్రముఖ పోషకాహార నిపుణురాలు రీటా జైన్ చక్కెర వర్సెస్ బెల్లం ఏది మంచిదో చెప్పారు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


బెల్లం వర్సెస్ చక్కెర


​సాధారణంగా, బెల్లం సహజమైంది. ఇది తక్కువ ప్రాసెస్ చేయబడింది, ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంటుందని చాలా మంది అనుకుంటారు. చక్కెర అనేది సాధారణ కేలరీలను అందించే శుద్ధి చేసిన ఉత్పత్తి. ఇది కొంతవరకు నిజం. బెల్లం చక్కెరలో లేని ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి కొన్ని సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుంది. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ వస్తుంది. అదే గ్లైసెమిక్ ఇండెక్స్ (GI).


గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి?


గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక ఆహారం మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతుందో తెలియజేసే స్కేల్. 0 నుండి 100 వరకు ఉన్న ఈ స్కేల్‌ ఉంటుంది. సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, రక్తంలో చక్కెర అంత వేగంగా పెరుగుతుంది. బెల్లం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ రీటా జైన్ వంటి చాలా మంది పోషకాహార నిపుణులు ఈ నమ్మకం పూర్తిగా సరైనది కాదని అంటున్నారు. తెల్ల చక్కెర యొక్క గ్లైసెమిక్ సూచిక 70-75 చుట్టూ ఉంటుంది. అయితే బెల్లం యొక్క గ్లైసెమిక్ సూచిక 80 నుంచి 85 వరకు ఉంటుంది. దీని అర్థం బెల్లం రక్తంలో షుగర్ లెవల్స్‌ని తెల్ల చక్కెర కంటే వేగంగా పెంచుతుంది.


డయాబెటిస్ పేషంట్లకు ఏది మంచిది?


బెల్లం ఖచ్చితంగా తెల్ల చక్కెరలో కనిపించని కొన్ని ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ ఖనిజాలు మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయుర్వేదంలో బెల్లం జీర్ణక్రియకు సాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. బెల్లం చక్కెరతో సమానమైన కేలరీలు, కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. మీరు ఒక చెంచా చక్కెరకు బదులుగా రెండు చెంచాల బెల్లం తింటుంటే, తెలియకుండానే ఎక్కువ కేలరీలు, చక్కెరను తీసుకుంటున్నారు. బెల్లంలో ప్రధానంగా సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌గా విడిపోయి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. పోషకాలు ఉన్నప్పటికీ, బెల్లం అధిక మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇక, చక్కెర కూడా రక్తంలో వేగంగా షుగర్ లెవల్స్ పెంచుతుంది.


పోషకాహార నిపుణుల సలహా


చక్కెర అయినా.. బెల్లం అయినా రెండూ చక్కెరకు మూలాలేనని, రెండింటినీ పరిమిత పరిమాణంలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులు చక్కెర విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, బెల్లం వినియోగం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొందరు నిపుణులు రోజుకు 1-2 టీస్పూన్లకు మించకుండా బెల్లం తీసుకోవచ్చని సూచిస్తారు.


బెల్లంలో పోషకాలు ఉన్నప్పటికీ, ఇందులో ఎక్కువ భాగం చక్కెర రూపంలోనే ఉంటుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునే వారు బెల్లాన్ని కూడా మితంగానే తీసుకోవాలి. శుద్ధి చేసిన చక్కెర కంటే మెరుగు అయినప్పటికీ, అధిక మొత్తంలో బెల్లం తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కొన్ని రకాల బెల్లంలో రంగు కోసం లేదా గట్టిపడటానికి కొన్ని రసాయనాలను వాడవచ్చు. ముదురు రంగులో ఉండే బెల్లం సాధారణంగా తక్కువ శుద్ధి చేయబడిందని తెలుపుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa