ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీప్ ఫ్రీజ్‌లో గడ్డ కట్టిన ఐస్‌ని తొలగించే సింపుల్ చిట్కాలు

Life style |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 11:34 PM

ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లలోనూ ఫ్రిజ్ ఉంటోంది. చాలా మంది దీనికి అలవాటు పడిపోయారు. కూరగాయల నుంచి పచ్చళ్ల, పొడుల వరకూ అన్నింటినీ ఫ్రిజ్ లో స్టోర్ చేసేస్తున్నారు. పిండి రుబ్బి అందులోనే నాలుగైదు రోజుల పాటు ఉంచుతున్నారు. ఇలా వాడుతున్నారు సరే. కానీ ఫ్రీజర్ సంగతేంటి. మధ్యమధ్యలో అయినా లోపల క్లీన్ చేస్తున్నారా. చాలా సార్లు ఫ్రీజర్ లో ఐస్ గడ్డకట్టిపోతుంది. కొన్ని సార్లు ఇది అసలు తొలగించలేనంత గట్టిగా మారిపోతుంది.


అలాంటప్పుడు సింపుల్ గా డీఫ్రాస్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ దీని వల్ల కూడా ఒక్కోసారి అది కరిగిపోదు. ఆ సమయంలోనే ఐస్ ని తొలగించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే మాత్రం ఈ పని చాలా సులువుగా పూర్తైపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే గడ్డ కట్టిన ఐస్ కరిగిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకోండి.


ఫ్రీజర్ లో ఐస్ గడ్డకడితే 


ఐస్ ఇలా గడ్డకడితే అలాగే ఉంటే ఫ్రిజ్ పాడైపోతుంది. పైగా సరైన విధంగా కూలింగ్ అవదు. దీని వల్ల పవర్ బిల్లు వృథా అయిపోతుంది. లోపల ఉన్న ఆహార పదార్థాలు కూడా పాడైపోతాయి. అయితే సింపుల్ గా డిఫ్రాస్ట్ ఆప్షన్ వాడవచ్చు అనుకుంటారు కానీ ప్రతిసారీ దీనితో పని అవ్వకపోవచ్చు. అందుకే కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.


అందులో మొదటి చిట్కా ఏంటంటే..ముందుగా ఫ్రిజ్ కి పవర్ సప్లై ఆపాలి. అంటే స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం ఎప్పటికైనా సరే సేఫ్టీ. ఆ తరవాత ఫ్రిజ్ లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయటకు తీయాలి. వాటన్నింటినీ కాస్త చల్లగా ఉన్న చోట పెట్టాలి. ఇప్పుడు ఫ్రిజ్ చుట్టూ పెద్ద టవల్స్ వేసి ఉంచాలి. పవర్ సప్లై ఆగిపోవడం వల్ల మంచు గడ్డకట్టడం ఆగిపోతుంది. పైగా ఉన్న మంచు అంతా క్రమంగా కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన నీరంతా కింద వేసిన టవల్స్ పై పడుతుంది. ఆ తరవాత ఆ టవల్స్ ని ఉతికితే సరిపోతుంది.


మరో చిట్కా


ఇక ఇప్పుడు చెప్పే మరో చిట్కాతో ఫ్రీజర్ లోని ఐస్ అంతా చాలా వేగంగా కరిగిపోతుంది. అందుకోసం ఏం చేయాలంటే ముందుగా ఓ గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి. వాటిని వేడిని ఎక్కువ సమయం పాటు పట్టి ఉంచే గిన్నెలో పోయాలి. ఆ తరవాత ఫ్రీజర్ లో మందంగా ఉన్న క్లాథ్ వేయాలి. ఆ క్లాథ్ పై ఈ బౌల్ పెట్టాలి. తరవాత ఫ్రీజర్ డోర్ మూసేయాలి. ఇలా కనీసం పావుగంట పాటు ఉంచాలి. ఆ తరవాత డోర్ తీసి చెక్ చేయాలి. అప్పటికే మంచు అంతా క్రమంగా కరిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు లేదా చెక్కతో తయారు చేసిన గరిటెలు, చెంచాలతో ఆ మంచుని తొలగించాలి. మీరు కదిలించే కొద్దీ మంచు చాలా సులువుగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే మంచుని తొలగించేటప్పుడు మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. దీని వల్ల కాయిల్స్ పాడయ్యే అవకాశముంది.


హెయిర్ డ్రయర్ తో


హెయిర్ డ్రయర్ తో కూడా ఈ మంచు మొత్తం తొలగించవచ్చు. కాకపోతే జాగ్రత్తలు పాటించాలి. ముందుగా హెయిర్ డ్రయర్ ని మీడియం లేదా లో హీట్ సెట్టింగ్ వద్ద ఉంచాలి. ఫ్రీజర్ కాస్తంత దూరంగా ఉంచి డ్రై చేయాలి. ఎక్కడైతే మరీ ఎక్కువగా ఐస్ గడ్డకట్టి ఉంటుందో అక్కడ ఎక్కువ సేపు ఉంచాలి. ఇలా చేస్తుండగానే కాసేపటికే మంచు అంతా కరిగిపోతుంది. అయితే పొరపాటున కూడా హెయిర్ డ్రయర్ పై వాటర్ పడకుండా చూసుకోవాలి. అందుకే కాస్తంత దూరంగానే ఉంచాలి. ఈ ప్రాసెస్ అంతా చేసే సమయంలో ఫ్రిజ్ కి పవర్ సప్లై ఆపేస్తేనే బెటర్. ఫ్రిజ్ క్లీన్ చేసినప్పుడు లేదా ఫ్రిజ్ లో ఇంకేదైనా రిపేర్ చేసినప్పుడు తప్పనిసరిగా పవర్ ఆపేయడం మంచిది. అలా ఆన్ చేసి ఎక్కువ సమయం పాటు ఉంచితే కరెంట్ షాక్ వచ్చే ముప్పు ఉంటుంది. అంతే కాదు. కాయిల్స్ పాడైపోయే అవకాశమూ ఉంటుంది.


టవల్ తో కూడా 


ముందుగా ఓ గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి. ఆ తరవాత వేడి నీళ్లలో మందంగా ఉన్న టవల్ ముంచాలి. ఆ తరవాత ఫ్రిజ్ స్విచాఫ్ చేసి టవల్ ని ఫ్రీజర్ లో ఉంచాలి. ఆ తరవాత ఫ్రీజర్ డోర్ మూసేసి కనీసం పది నిముషాల పాటు వదిలేయాలి. ఈ వేడి వల్ల క్రమంగా మంచు సాఫ్ట్ గా మారిపోతుంది. సులువుగా తొలగించేందుకు వీలవుతుంది. హెయిర్ డ్రయర్ చిట్కా పాటించడం కాస్త రిస్క్ అనుకున్నప్పుడు ఈ టవల్ చిట్కా ఫాలో అయిపోవచ్చు. దీని వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు . మరోలా కూడా ప్రయత్నించవచ్చు. ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేసి ఐస్ కి సరైన విధంగా గాలి తగిలేలా ఎదురుగా ఓ టేబుల్ ఫ్యాన్ పెట్టాలి. దీని వల్ల వేడి గాలి తగిలి గడ్డకట్టిన మంచు అంతా మెల్లగా కరిగిపోతుంది.


ఐస్ కరిగాక ఏం చేయాలంటే 


ఫ్రీజర్ లో ఉన్న ఐస్ అంతా కరిగిపోయిన తరవాత లోపల అంతా ఓ సాఫ్ట్ క్లాథ్ తో శుభ్రం చేయాలి. అయితే.. మామూలు నీటితో కాకుండా వేడి నీటితో క్లీన్ చేయడం మంచిది. ఈ నీళ్లలోనే కాస్తంత వెనిగర్ లేదా సబ్బు నీరు కలిపితే ఇంకా బాగా శుభ్రం అవుతుంది. ఇలా క్లీన్ చేసిన తరవాత పూర్తిగా ఆరేంత వరకూ అలాగే ఫ్రిజ్ డోర్ తెరచి ఉంచాలి. తేమ అంతా తగ్గిపోయిన తరవాతే మళ్లీ ఫ్రిజ్ ఆన్ చేయాలి. ఫ్రీజర్ డోర్ ని ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తూ ఉండాలి. డోర్ కి ఏమైనా లీకేజ్ లు ఉన్నాయా అన్నది చెక్ చేయాలి. మరీ ఎక్కువగా ఐటమ్స్ పెట్టినా ఫ్రిజ్ పాడైపోతుందని గుర్తుంచుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa