పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో జరుగుతోన్న చర్చలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నట్టుగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే కారణమంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రశిబిరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల తారాస్థాయికి చేరుకోగా.. మూడు రోజుల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి.
జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్ 22 (పహల్గాం దాడి) నుంచి జూన్ 17 మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక్కసారైనా ఫోన్ సంభాషణ జరగలేదు’’ అని తేల్చిచెప్పారు. గత వారం కూడా ట్రంప్, తానే భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఒత్తిడి తెచ్చానని, ఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య అణు యుద్ధాన్ని వాణిజ్యం అస్త్రంతో ఆపేశానంటూ గొప్పలు చెప్పుకున్నారు. ‘మీ అణ్వాయుధాలను కాదు.. మీ అందమైన వస్తువులను మార్పడిచేసుకుని వ్యాపారం చేద్దాం’’అని మోదీ, పాకిస్థాన్‌లకు సూచించానని ట్రంప్ అన్నారు.
అయితే, భారత్ అనేక సందర్భాల్లో ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను తిరస్కరించింది. కశ్మీర్ విషయంలో పాక్ ఆక్రమణను చట్టబద్ధంగా అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది. ట్రంప్ ప్రకటనలను తప్పుదారి పట్టించే ప్రచారంగా న్యూఢిల్లీ భావిస్తోంది. ‘‘జులై 1న నేను చెప్పినట్టుగానే తాను ప్రధానితో ఉన్నప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మోదీతో మాట్లాడారని.. ఆ ఫోన్ సంభాషణలో కాల్పుల విరమణ, వాణిజ్య ఒప్పందాలకు ఎలాంటి సంబంధం లేదు’’ అని జైశంకర్ స్పష్టం చేశారు. ‘‘భారత్ తన భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలను ఏ మాత్రం సహించదు... మా పౌరుల రక్షణ కోసం అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పార్లమెంట్ వేదికగా పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపారు. కాగా, పహల్గామ్ దాడి ప్రధాన సూత్రధారి, పాక్ ఆర్మీ మాజీ కమాండో హషీమ్ మూసా కశ్మీర్‌లో భద్రతా బలగాలు సోమవారం ఉదయం మట్టుబెట్టాయి. ఇందుకోసం ఆపరేషన్ మహాదేవ్ చేపట్టాయి. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో చర్చకు కొద్ది గంటల ముందే ఈ ఆపరేషన్ జరగడం గమనార్హం. ఈ ఎన్‌కౌంటర్‌లో మూసాతో సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మా చీనాబ్ కార్ప్స్ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa