ఇటీవల కాలంలో ప్రపంచ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్, అమెరికా సంబంధాల్లో మునుపెన్నడూ చూడని పరిణామాలు భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయి. గతంలో పాకిస్థాన్‌ను పక్కనబెట్టిన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ యంత్రాంగం.. ఇప్పుడు దాంతో రాసుకుపూసుకునేంతగా మారిపోయింది. ఏడాది ముందు వరకూ పాకిస్థాన్ ప్రధానికి అమెరికా అధ్యక్షుడు కనీసం ఫోన్‌లో మాట్లాడటం కూడా కష్టమే. కానీ ఇప్పుడేమైంది? పాక్ విదేశాంగ మంత్రి వాషింగ్టన్ పర్యటన, ఆ దేశ ఆర్మీ చీఫ్‌కు అమెరికా అత్యున్నత సైనిక పురస్కారం, ట్రంప్‌తో మునీర్ విందు, అమెరికా సెంట్రల్ కమాండో చీఫ్ జనరల్ మైక్ కురిల్లాకు ఇస్లామాబాద్ ఘన సత్కారం ఇవన్నీ చూస్తుంటే, పాకిస్థాన్ నూతన అంతర్జాతీయ వ్యూహానికి బలమైన సంకేతాలే.
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ముందు నిలబడి, అమెరికా జనరల్ గౌరవ వందనం స్వీకరించడం ఒక ప్రహసనమే. అసలు పాక్‌లో అధికారం ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మునీర్ చేతిలోనే ఉంది. అలాగే, పాక్ జాతీయ భద్రతా సలహదారు అయిన ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్ అమెరికాతో అన్ని కీలక ఒప్పందాలను నడుపుతున్నారు.
వాస్తవంగా చూస్తే ఒక వైపు అమెరికా మద్దతుతో అఫ్గనిస్థాన్‌లోని ISIS-Kపై పోరాడుతున్నట్లు చెబుతూనే, మరోవైపు తమ భూభాగం మీద జేషే ఉల్ అద్ల్ ద్వారా ఇరాన్‌పై దాడులకు పాకిస్థాన్ అవకాశం కల్పిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణు దాడి చేస్తే.. పాకిస్థాన్ టెల్ అవీవ్‌పై అణుబాంబులు వేసి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని ఇటీవల ఇరాన్ జనరల్ మొహ్సెన్ రెజాయీ ప్రకటించడం గమనార్హం.
ఏది ఏమైనప్పటికీ అమెరికాకు తన ప్రయోజనాలే ముఖ్యం. పాక్‌తో అంటకాగడానికి కూడా బలమైన కారణం ఉంది. బలూచిస్థాన్‌లోని ఖనిజ సంపదపై కన్నేసింది. రెకో డిక్ (Reko Diq) లోని బంగారు, రాగి గనుల్లో అమెరికాకు చెందిన బారిక్ మైనింగ్ అనే సంస్థ (Barrick Mining) తవ్వకాలు జరుపుతుండగా.. అదే ప్రాంతంలో చైనా మైనింగ్, పవర్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పోటీ చైనాను అసహనానికి గురి చేస్తోంది. వాస్తవానికి, పాకిస్థాన్ ఆర్మీ తన దేశ ప్రస్తుత బలాన్ని ఇలా వ్యాపారంగా మార్చుకుంటున్నా.. భవిష్యత్తులో దీనికి భారీ మూల్యం తప్పదు. ఇప్పటికే బలూచిస్థాన్‌లో వేర్పాటువాదం పాకిస్థాన్ భద్రతకు పెను ముప్పుగా పరిణమించింది. తమ సహజవనరులను దోచుకుని, తమపై పెత్తనం చెలాయిస్తుందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తరుచూ పాకిస్థాన్ సైన్యం బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడుతోంది.
క్రిప్టో దౌత్యం
పహల్గామ్ ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందు ట్రంప్ కుటుంబంతో సంబంధాలు ఉన్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ ( World Liberty Financial) పాకిస్థాన్‌తో బ్లాక్‌చైన్, క్రిప్టోకరెన్సీపై ఒప్పందం చేసుకుంది. ఇస్లామాబాద్ ప్రభుత్వం మాత్రం సరైన చట్టాలు లేకుండానే ఈ ఒప్పందానికి ఊతమిస్తోంది. క్రిప్టో యాడప్షన్ ఇండెక్స్ ప్రకారం.. ఇప్పటికే 10 బిలియన్ డాలర్లు విలువైన క్రిప్టో హోల్డింగ్స్‌తో దాయాది ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. (Crypto Adoption Index ప్రకారం).
ఈ పరిణామాలను పరిశీలిస్తే అమెరికా ఖచ్చితంగా పాక్‌ను తన ఆర్థిక ప్రయోజనాలకు వాడుకుంటోంది. అదే సమయంలో ఆ దేశ సైన్యానికి మరింత అధికారాన్ని అంకితంగా ఇస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ సంబంధాలు క్షీణించిన తరుణంలో అగ్రరాజ్యం అమెరికా దాయాదితో అంటకాగుతుండటం వ్యూహాత్మకంగా భారత్ ఎదుర్కొనే ప్రధాన సవాల్‌గా మారే అవకాశం ఉంది. అంతేకాదు, ఆసియాలో కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా తెరతీసే ప్రయత్నంలో ఉన్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa