పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు గొప్ప దౌత్య విజయం లభించింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1267 ఆంక్షలు కమిటీకి చెందిన మానిటరింగ్ టీమ్ (MT) నివేదికలో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఈ నివేదికలో లష్కరే తొయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పహల్గామ్ దాడికి బాధ్యత వహించినట్లు స్పష్టంగా పేర్కొంది. ‘ఈ నివేదికలోని దక్షిణాసియా విభాగంలో టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావన ముఖ్యమైంది... లష్కరే తొయిబా, టీఆర్ఎఫ్ల మధ్య సంబంధాలను, వాటికి పాకిస్థాన్ మద్దతును బట్టబయలు చేసింది’ అని వర్గాలు తెలిపాయి.
ఐరాస నివేదికలో ఏముంది?
పహల్గామ్లో 26 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఉగ్రదాడికి తామే పాల్పడినట్టు టీఆర్ఎఫ్ రెండు సార్లు బాధ్యత వహించింది.. మానిటరింగ్ టీం నివేదికలో, దాడి జరిగిన రోజే టీఆర్ఎఫ్ దాడికి బాధ్యత వహించిందని, ఘటనా స్థలానికి సంబంధించిన ఫొటోను కూడా ప్రచురించినట్లు నివేదిక తెలిపింది. అయితే, ఏప్రిల్ 26న టీఆర్ఎఫ్ తమ ప్రకటనను వెనక్కి తీసుకుంది.. ఆ తరువాత ఎటువంటి అధికారిక ప్రకటన వారి నుంచి రాలేదని నివేదిక పేర్కొంది. మరోవైపు, కొన్ని సభ్యదేశాలు ఈ దాడి లష్కరే తొయిబా మద్దతు లేకుండా జరగలేదని అభిప్రాయపడ్డాయని వక్కానించింది.
కాగా, ఐరాస భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరుగుతాయి. టీఆర్ఎఫ్ ప్రస్తావనతో పాటు లష్కరే తొయిబాపైన 2019 తరువాత తొలిసారి నివేదికలో ప్రస్తావన రావడం ఇదే మొదటిసారి. తద్వారా పాకిస్థాన్ ఉగ్రవాద వ్యవస్థపై భారత్ అందించిన ఆధారాలు ఆమోదించినట్టు తెలుస్తోంది.
భారత్ దౌత్య విజయం
అలాగే, గత ఏడాది డిసెంబరు నుంచి టీఆర్ఎఫ్ కార్యకలాపాలపై మానిటరింగ్ టీమ్‌కు భారత విదేశాంగ శాఖ (MEA) వివరాలను అందించినట్ుట ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024లో రెండు విడతల్లో టీఆర్ఎఫ్- లష్కరే తొయిబా సంబంధాలపై వివరాలతో కూడిన ఆధారాలను అందజేసింది. మే 2024లో న్యూయార్క్‌లో ఐరాస ఉన్నతస్థాయి అధికారులతో భారత ప్రతినిధుల సమావేశమయ్యారు.
ఇటీవలే టీఆర్ఎఫ్ను అమెరికా ప్రభుత్వ విదేశీ ఉగ్రవాద సంస్థగా, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. పహల్గామ్ సహా అనేక ఉగ్రదాడుల్లో ది రెసిస్టెంట్ ఫ్రంట్ పాత్రను ప్రస్తావిస్తూ.. ‘ట్రంప్ యంత్రాంగం ఉగ్రవాద వ్యతిరేక విధానంలో అంకితభావాన్ని సూచిస్తుంది’ అని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
కాగా, లష్కరే తొయిబాకు అనుబంధంగా 2019లో టీఆర్ఎఫ్ ఏర్పాటైంది. రెండేళ్ల కిందట భారత ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. ఆన్లైన్లో యువతను ఆకర్షించడంలో, ఉగ్రవాదుల చొరబాటుకు సహకరించడంలో, పాక్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ రవాణాలో టీఆర్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు, పౌరులు, రాజకీయ నాయకులు, భద్రతా సిబ్బందిపై దాడులకు పాల్పడిన చరిత్ర దీనికి ఉంది. టీఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు షేక్ సజ్జాద్ గుల్‌ను ఉపా చట్టం( UAPA) కింద ఉగ్రవాదిగా ముద్రవేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa