ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్ ఇండియాలో 100 ఉల్లంఘనలు.. శిక్షణలోనూ లోపాలు..: డీజీసీఏ సంచలనం

national |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 08:13 PM

భారత విమానయాన రంగంలో అత్యంత విశ్వసనీయమైన పేర్లలో ఒకటిగా భావించే ఎయిర్ ఇండియా పెను సవాళ్లను ఎదుర్కుంటోంది. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ప్రమాదం తర్వాత నుంచి దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సదరు విమానాల్లో సాంకేతిక సమస్యలపై, పైలెట్ల శిక్షణపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్వహించిన సమగ్ర ఆడిట్‌లోనూ.. ఎయిరిండియా తీవ్రమైన భద్రతా లోపాలను ఎదుర్కొంది. జులై 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరిగిన ఈ తనిఖీల్లో దాదాపు 100కి పైగా ఉల్లంఘనలు, పరిశీలనలను డీజీసీఏ గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది.


గతంలో ప్రభుత్వం అధీనంలో ఉన్న ఈ వియమాన సంస్థను 2022లో టాటా గ్రూప్ తిరిగి తన చేతుల్లోకి తీసుకుంది. అప్పటి నుంచి సదరు సంస్థ సవాళ్లను ఎదుర్కుంటూనే వస్తోంది. ఎయిరిండియా విమాన సర్వీసులు తరచూ ఆలస్యం అవుతున్నాయని, సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటున్నాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ విమానయాన సంస్థలో పలు లోపాలు ఉన్నట్లు డీజీసీఏ వెల్లడించింది. మొత్తంగా ఇందులో 51 కీలక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వీటిలో కొన్ని "లెవల్ 1" భద్రతా వర్గీకరణ కిందకు వస్తాయి. అంటే అవి అత్యంత క్లిష్టమైనవి. తక్షణమే సరిదిద్దాల్సినవి.


"లెవల్ 1" ఉల్లంఘనలపై జూలై 30 నాటికి వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశించింది. మిగిలిన 44 నిబంధనల ఉల్లంఘనలపై ఆగస్టు 23 లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. ఈ ఆడిట్‌లో వెల్లడైన ప్రధాన ఉల్లంఘనలలో లోపభూయిష్టమైన సిమ్యులేటర్లు ఉన్నాయి. ఇవి పైలట్లకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బోయింగ్ 787, 777 విమానాల పైలట్ల పునరావృత శిక్షణలో కూడా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు.


ఇంకా బోయింగ్ 787 విమానానికి సంబంధించిన ఒక సందర్భంలో.. విమాన విధి సమయ పరిమితులను ఉల్లంఘించిందని ఆడిట్ పేర్కొంది. ప్రమాదకరమైన విమానాశ్రయాల కోసం సరైన మార్గ అంచనాలను నిర్వహించడంలో వైఫల్యం, కనీస సిబ్బంది అవసరాలకు "హార్డ్ అలర్ట్‌లు" లేని రోస్టరింగ్ వ్యవస్థ కారణంగా అంతర్జాతీయ విమానాలు తగినంత క్యాబిన్ సిబ్బంది లేకుండానే నడిచాయని డీజీసీఏ నివేదించింది. తలుపులు, పరికరాల తనిఖీలలో అస్థిరతలు, శిక్షణ డాక్యుమెంటేషన్‌లో లోపాలు, అలాగే ఎయిర్‌బస్ A320, A350 విమానాలకు చీఫ్ పైలట్లు లేకపోవడం వంటి ఇతర కీలక లోపాలను కూడా ఆడిట్ గుర్తించింది.


జూన్‌లో జరిగిన విమాన ప్రమాదం (ఫ్లైట్ 171) తర్వాత.. ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించిన సంఘటనలు పెరగడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆడిట్ నివేదికలోని అన్ని అంశాలను ఎయిర్ ఇండియా గుర్తించిందని, నిర్దేశిత గడువులోగా నియంత్రణ సంస్థకు వివరణాత్మక నివేదికను, సరిదిద్దు చర్యల వివరాలను సమర్పిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa