ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొల్యూషన్ వల్ల సీరియల్ కిల్లర్లుగా మారి... రేప్, మర్డర్లు

international |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 09:30 PM

సీరియల్ కిల్లర్స్.. వీరిని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. ఇలాంటి వాటిలో కిల్లర్లు ఒక ప్యాటర్న్‌లో హత్యలు, హత్యాచారాలు చేస్తారు. వీరు ఇలా మారడానికి అనేక కారణాలుంటాయని క్లైమాక్స్‌లో చూపిస్తారు!. సాధారణంగా చాలా మంది సీరియల్ కిల్లర్లుగా మారడానికి.. మానసిక సమస్యలు, చిన్నతనంలో జరిగిన సంఘటనలు, జెనెటిక్ లేదా సామాజిక-మానసిక పరిస్థితుల కారణాలుగా చెబుతారు. కానీ పర్యావరణ కాలుష్యం వల్ల హింసాత్మక ప్రవర్తన పెరగడం.. ముఖ్యంగా సీరియల్ కిల్లర్లుగా మారారనేది ఎప్పుడైనా విన్నారా? వినడానికి వింతగా ఉన్నా.. ఇదే జరిగిందట!. అమెరికాలో.. ముఖ్యంగా పసిఫిక్ నార్త్‌వెస్ట్‌ ప్రాంతంలో సీరియల్ కిల్లర్లు పెరగడానికి.. పరిశ్రమల నుంచి వెలువడిన కాలుష్య కారకాలే కారణమట. ఆశ్చర్యంగా ఉంది కదూ!


పొల్యుషన్ వల్లే అమెరికాలో ఒకప్పుడు సీరియల్ కిల్లర్లు పెరిగారని పులిట్జర్ ప్రైజ్ విజేత కరోలిన్ ఫ్రేజర్ (Caroline Fraser) చెబుతున్నారు. తాను రాసిన బుక్- 'మర్డర్‌ల్యాండ్' (Murderland: Crime and Bloodlust in the Time of Serial Killers) అనే పుస్తకంలో ఈ మేరకు చెప్పారు. అసలు రచయిత్రి కరోలిన్ ఫ్రేజర్ ఈ షాకింగ్ కంక్లూజన్‌కు రావడానికి కారణాలేంటి? ఈ వాదనను బలపరచడానికి ఆమె చూపిస్తున్న ఆధారాలు ఏమిటి? దీనిపై శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.


అమెరికాలో ముఖ్యంగా 1970ల్లో, 1980ల్లో సీరియల్ కిల్లర్ల అరాచకాలకు హద్దూఅదుపు ఉండేది కాదు. అందుకే ఆ కాలాన్ని సీరియల్ కిల్లర్లకు గోల్డెన్ ఏజ్‌గా అభివర్ణించేవారు. ముఖ్యంగా పసిఫిక్ నార్త్‌వెస్ట్ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ ప్రాంతాన్ని ముద్దుగా అమెరికన్ కిల్లింగ్ ఫీల్డ్‌గా పిలిచేవారు. 18-24 మధ్య వయసున్న యవతే హత్యలు, హత్యాచారాలకు పాల్పడే వారు. అందులోనూ పురుషులే అధికంగా ఉండేవారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. ఈ పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లో.. సీరియల్ కిల్లర్లు అచారకం ఎక్కువైపోయింది.


ఆ సమయంలో టెడ్ బండీ (Ted Bundy), ది హిల్‌సైడ్ స్ట్రాంగ్లర్ (the Hillside Strangler), ది గ్రీన్ రివర్ కిల్లర్ (Green River Killer), ఐ-5 కిల్లర్ (the I-5 Killer) వంటి సైకోలు మారణహోమం సృష్టించారు. వారు ఇలా చేయడానికి కారణాలు ఇవే అంటూ అనేక థియరీలు పుట్టుకొచ్చాయి. అయితే పరిశ్రమల స్మెల్టర్లు (Smelters - ముడి ఇనుము నుంచి ఇనుమను వేరు చేసేందుకు, వేడి చేయడం లేదా రసాయన ప్రక్రియ కోసం ఉపయోగించే పరికరం) నుంచి విడుదలైన ప్రమాదకర కెమికల్స్.. ముఖ్యంగా లెడ్ (సీసం) (lead), కాపర్ (copper ), ఆర్సెనిక్ (arsenic) సైకోలుగా మారడానికి కారణమని కరోలిన్ ఫ్రేజర్ తన పుస్తకంలో పేర్కొంది.


కరోలిన్ ఎందుకు ఆ కంక్లూజన్‌కు వచ్చింది?


1974లో సీరియల్ కిల్లర్ టెడ్ బండీ హత్యలు, అత్యాచారాల పరంపర కొనసాగుతున్న రోజులవి. అప్పటికి 7 ఏళ్ల వయసున్న కరోలిన్.. ఆ అరాచకాలు జరిగిన ప్రాంతానికి కేవలం మైళ్ల దూరంలోనే నివసించేది. అప్పటి నుంచి ఆమెకు ఆ ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో లేదా ముగిసిన కొన్నేళ్లకు పుట్టిన పురుషులు ఇంత ప్రమాదకరంగా ఎలా మారారు అనే ప్రశ్నలు ఆమె మొదడును తొలిచేశాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకున్న కరోలిన్.. 2010లో ఎక్కువగా ప్రచారంలో ఉన్న 'లెడ్ క్రైమ్ హైపోథెసిస్' (lead-crime hypothesis)ను లోతుగా పరిశీలించడం ప్రారంభించింది. ఇక నేషనల్ సగటు కంటే.. వాషింగ్టన్ స్టేట్‌లో క్రైమ్ రేటు మూడింతలు ఎక్కువగా ఉండటం.. కరోలినాను పట్టుదలగా ముందుకు నడిపించింది. ఇలా తన వాదనలను బలపరుచుకుంది కరోలిన్ ఫ్రేజర్.


మెదడుపై తీవ్ర ప్రభావం..


కరోలిన్ ప్రకారం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గాలిలో లెడ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా స్మెల్టింగ్ పరిశ్రమల నుంచి ఇది ఎక్కువగా వెలువడేది. పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లో ఉన్న టకోమాలో (Tacoma) అమెరికన్ స్మెల్టింగ్ అండ్ రిఫైనింగ్ కంపెనీ (ASARCO)కి చెందిన స్మెల్టింగ్ యూనిట్లు ఉండేవి. దాదాపు వందేళ్ల పాటు లెడ్, ఆర్సెనిక్ వంటి ప్రమాదకర పదార్థాలను విడుదల చేసి.. గాలిలో, మట్టిలో అధిక స్థాయిలో కలిసి పోయేలా చేశాయి.


కరోలినా చెప్పిన వివరాల ప్రకారం.. స్మెల్టింగ్ యూనిట్ల నుంచి వెలువడే లెడ్ (సీసం) మనుషుల్లో అగ్రెషన్ (ఆవేశం) కలిగేలా చేస్తుంది. పిల్లలు పెరిగే క్రమంలో మొదడును డేమేజ్ చేస్తుంది. జియోకెమిస్ట్ క్లెయిర్ ప్యాటెర్సన్ చెప్పినట్లు.. లెడ్ వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి తగ్గుతుందని.. కాగ్నిటివ్ ఫంక్షన్స్ సరిగా చేయలేరని కరోలిన్ తెలిపింది. ఇదే కాకుండా లెడ్ వల్ల ఫ్రంటల్ కార్టెక్స్ ( frontal cortex) దెబ్బతింటుందని.. ఫలితంగా మునుషుల్లో అగ్రెషన్ ఎక్కువవుతందని చాలా అధ్యయనాలు రుజువు చేశాయని కరోలిన్ చెప్పింది. అలా సైకోపాత్‌లుగా మారారని వివరించింది.


తన వాదనలను 1913లో కెమిస్ట్ ఫ్రెడరిక్ గార్డనర్ కాట్రెల్ చెప్పిన మాటలు బలపరుస్తున్నాయని పేర్కొంది కరోలిన్. "సాధారణంగా వెలవడే పొగ కన్నా స్మెల్టర్ల నుంచి వచ్చే పొగ వేరుగా ఉంటుంది. జింక్, సల్ఫర్ డైఆక్సైడ్, లెడ్, ఆర్సెనిక్.. వంటి పదార్థాలు అంత సులువుగా కాలిపోవు. దానికి బదులుగా గాలిలో కలిసిపోతాయి, మనుషుల బ్లడ్ స్ట్రీమ్‌లో కలిసిపోతాయి. గర్భంతో ఉన్న తల్లుల నుంచి కడుపులో ఉండే పిండాల వరకు చేరుతాయి." అని కెమిస్ట్ ఫ్రెడరిక్ గార్డనర్ చెప్పినట్లు కోరోలినా తెలిపింది.


స్మెల్టర్లకు దగ్గరగా జీవించే వారికి ఇది క్రమంగా అతిపెద్ద ఆనారోగ్య సమస్యగా పరిణమిస్తుందని కరోలినా చెప్పింది. అంతేకాకుండా.. ఆ రోజుల్లో కాలుష్య ప్రమాదాన్ని తక్కువ చేసి చూపేందుకు స్మెల్టర్ కంపెనీ ప్రయత్నాలు చేశాయని కరోలిన్ ఆరోపించింది. ఇక లెడ్ ఉండే గ్యాసోలిన్‌ వాడకం 1996 నాటికి పూర్తిగా మానేశారు. లెడ్ ఉన్న పేయింట్, పైపులను 1980ల కల్లా వాడకం పూర్తిగా ఆపేశారు. 1994లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చేసిన పరిశోధనలో.. 1 నుంచి 74 వయసున్న వారిలో 1976 నుంచి 1991 వరకు లెడ్ లెవెల్స్ 78శాతం తగ్గాయి. ఇక న్యూయార్క్ లాంటి నగరంలో 1990లో 2,245 ఉంటే.. 2025 నాటికి 112 హత్యలే నమోదయ్యాయని చెప్పారు. ఇది కూడా తన వాదనకు ఒక కారణంగా చెప్పారు కరోలిన్.


సైంటిస్టులు, క్రిటిక్స్ ఏమంటున్నారు?


కరోలిన్ ఫ్రేజర్ చేసిన లోతైన పరిశోధన, వినూత్న పర్యావరణ దృక్పథాన్ని సైంటిస్టులు, క్రిటిక్స్ అభినందిస్తున్నారు. అయితే కాలుష్యంతో సీరియల్ కిల్లర్లుగా మారారనే వాదనను.. ఒక శాస్త్రీమైన వాస్తవం కంటే.. ఆసక్తికర ఊహాజనిత ప్రతిపాదనగానే చూస్తున్నారు. ఎందుకంటే.. కాలుష్యం వల్ల సీరియల్ కిల్లర్లుగా మారింది పురుషులేనని ఫ్రేజర్ చెప్పింది. ఆర్థిక అనిశ్చితి, విచ్ఛిన్నమైన ఫ్యామిలీలు, భావోద్వేగాల అణచివేత వంటి సామాజిక పరిస్థితులు.. పురుషుల్లో హింసాత్మక ప్రవర్తనకు దారితీశాయని కరోలిన్ అన్నారు. పర్యావరణ కాలుష్యం పరిస్థితులను మరింత తీవ్రతరం చేసిందని ఆమె వాదించారు.


కాలుష్య పర్యవసనాలు మహిళల్లో, పురుషుల్లో ఎందుకు వేరుగా ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారు కరోలిన్. అంతేకాకుండా.. పొల్యూషన్ దేశవ్యాప్తంగా ఉన్నా.. కేవలం పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోనే ఎందుకు సీరియల్ కిల్లర్లు పెరిగారు అనే దానికి సరైన సమాధానం ఈ పుస్తకంలో లేదు. కాలుష్యరహితమైన గాలి పీల్చడం వల్ల మనుషులు అగ్రెసివ్‌గా, హింసాత్మకంగా మారుతారని గతంలో కొలరడో స్టేట్ యూనివర్సిటీలో చేసిన పరిశోధనల్లో తేలింది. అయితే పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లో సీరియల్ కిల్లర్లు పెరగడానికి.. కచ్చితంగా కాలుష్యమే కారణమని.. శాస్త్రీయ ఆధారం లేదు. అది నిర్ధరణ అయ్యేవరకు కరోలిన్ ఫ్రేజర్ వాదనలు కేవలం ఆసక్తికరమైన అంశాలుగానే పరిగణింపబడతాయి. కానీ అమె ప్రయత్నం మాత్రం అభినందనీయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa