ప్రజలకు మంచి చేసే పాలన అందించాల్సిన బాధ్యత తమదైతే, ఆ మంచిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ యంత్రాంగానిదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జోనల్ కో-ఆర్డినేటర్లు, రైతు సంఘం నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేపు ప్రారంభం కానున్న 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' పథకం, 'సుపరిపాలనలో తొలిఅడుగు' వంటి అంశాలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, ప్రజలకు ఆ విషయాలను వివరించాలని సూచించారు.తమ ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. శనివారం నుంచి 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' పథకాన్ని ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా అర్హుడైన ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20,000 అందిస్తున్నామని చెప్పారు. మొదటి విడతగా, రాష్ట్ర వాటా రూ. 5,000, కేంద్రం వాటా రూ. 2,000 కలిపి మొత్తం రూ. 7,000 జమ చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,342.92 కోట్లు విడుదల చేసిందని వివరించారు.అర్హులైన రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉండేలా ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా అర్హులు మిగిలిపోతే, 155251 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న ఈ మేలును పార్టీ యంత్రాంగం ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. గత ప్రభుత్వం రైతులకు అరకొర సంక్షేమం చేసిందని, పంటల బీమాకు ప్రీమియం చెల్లించకుండా రైతులను నిరాశపరిచిందని విమర్శించారు.గత ప్రభుత్వంతో పోలిస్తే, తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రెండింతలు అందిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే సూపర్ సిక్స్ లోని రెండు హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. శనివారం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయడంతో పాటు, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000, మంచానికే పరిమితమైన వారికి రూ. 15,000 పింఛను ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామని, ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ కార్యకర్తలేనని, నిత్యం ప్రజల్లో ఉండాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.కూటమి ప్రభుత్వం సంక్షేమం చేస్తుంటే, కొందరు ఓర్చుకోలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఇప్పుడు కూడా కుట్రలు పన్నుతూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ కుట్రల వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుందో ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులను కోరారు.'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమంలో భాగంగా కోటి కుటుంబాలను కలవడమే కాకుండా, వారి మనసులను కూడా గెలుచుకోవాలని సీఎం సూచించారు. గతంలో మంచిని చెప్పుకోవడంలో విఫలమయ్యామని, ఇప్పుడు అలా జరగకూడదని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరినీ గుర్తిస్తున్నామని, వారికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యకర్తలే ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్త అని, వారే ప్రజల మనసు గెలుచుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa