ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నా సమాధి నేనే తవ్వుకుంటున్నా’. కన్నీళ్లు పెట్టిస్తోన్న హమాస్ బందీ వీడియో

international |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 08:34 PM

గాజాలోని తమ చెరలో ఉన్న బందీకి సంబంధించి హమాస్ విడుదల చేసిన తాజా వీడియో భయానక వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వీడియోలో ఎవియతార్ డేవిడ్ అనే 24 ఏళ్ల ఇజ్రాయెల్ యువకుడు.. చిక్కిశల్యమైన శరీరంతో.. స్వయంగా తన సమాధిని తానే తవ్వుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గడచిన 48 గంటల్లో హమాస్ విడుదల చేసిన రెండో వీడియో ఇది కావడం గమనార్హం. సొరంగంలోని ఓ ఇరుకైన ప్రదేశంలో డేవిడ్ నేల తవ్వుతూ కనిపించాడు. కుంగి కృశించిపోయినా శరీరం, తడారిపోయిన గొంతుతో ‘‘ఇప్పుడు నేను నా సమాధి తవ్వుకుంటున్నాను... నీరసం ఆవహించి రోజుకోరోజు బలహీనపడుతున్నాను.. నేను నేరుగా సమాధివైపు నడుస్తున్నాను... ఇది నా సమాధి, ఇక్కడే నన్ను పాతిపెడతాను.. నా ఇంట్లో నా కుటుంబంతో గడుపుతూ.. నా మంచంపై హాయిగా నిద్రపోయే సమయం మించిపోయింది’’ అని కన్నీటిపర్యంతమయ్యాడు. కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో పలువురు బందీలను హమాస్ విడుదల చేసింది.


ఈ వీడియోను చూసిన ఎవియతార్ డేవిడ్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ‘‘ప్రచారం కోసం మా బిడ్డను ఉద్దేశపూర్వకంగా ఆకలికి గురిచేయడం ప్రపంచం చూసిన అత్యంత దారుణమైన చర్యల్లో ఒకటి. కనీసం మానవత్వం లేకుండా కేవలం ప్రచారం కోసమే హమాస్ ఇలా చేస్తోంది’’ అని వాపోయింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ సాయుధులు.. దాదాపు 1200 మందిని ఊచకోత కోసి.. మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో ఎవియతార్ ఒకరు.


ఈ దాడితో గాజాలో హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి గత 22 నెలలుగా జరుగుతోన్న ప్రతీకార దాడుల్లో 60,000 మందికిపైగా గాజా పౌరులు మరణించగా.. వేలాది మందిగాయపడ్డారు.


గాజా మొత్తం స్వాధీనం చేసుకుంటాం.. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన


ఇక, ఈ వీడియోపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.ఎవియతార్ కుటుంబంతో మాట్లాడిన ఆయన వారిని ఓదార్చారు. ‘‘ఈ వీడియోలోని దృశ్యాలు ఎంతో హృదయవిదారకమైనవి.. బందీల విడుదల కోసం ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’’ అని తెలిపారు. అంతేకాదు, ఉద్దేశపూర్వకంగా బందీలను ఆకలితో అలమటించేలా చేసి.. దానిని ప్రచారం కోసం హమాస్ ఉపయోగించడం పాశవిక చర్య అని మండిపడ్డారు.


ఈ రెండు వీడియోల విడుదల చేసిన తర్వాత ఇజ్రాయెల్‌లో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. శనివారం రాత్రి టెల్ అవీవ్ వీధుల్లోకి వచ్చిన లక్షలాది మంది ప్రజలు.. బందీల విడుదల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. గాజాపై యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ జరిగిన అత్యంత పెద్ద ర్యాలీగా ఇదే. ఎవియతార్‌ వీడియోకు ముందు రామ్ బ్రాస్లావ్స్కీ (21) అనే జర్మన్ సంతతికి చెందిన ఇజ్రాయెల్ యువకుడు వీడియోను విడుదల చేసింది. అతడు కూడా బాగా బలహీనంగా కనిపిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa