కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ ఈ మధ్య బీజేపీ నేతలు, ఆ ప్రభుత్వంతో ఎక్కువగా తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆయన ఎక్కువగా ఈ సర్కారుకే మద్దతు తెలుపుతుండగా.. ఆయన త్వరలోనే పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తునే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేమీ లేదని ఆయన చెబుతున్నా.. ఎవరూ ఆ మాటలు నమ్మడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను.. మీడియా ప్రతినిధులు ఓ ప్రశ్న అడిగారు. ముఖ్యంగా భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారని ప్రశ్నించారు. ఇందుకు శశిథరూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. మరి ఆయన ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందామా.
ముంబైలో తన తాజా పుస్తకం 'అవర్ లివింగ్ కాన్స్టిట్యూషన్' ఆవిష్కరణ సందర్భంగా శశిథరూర్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. ఈక్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారో నాకు తెలియదని చెప్పారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలనంటూ.. అధికార పార్టీ నుంచే నామినీ ఉంటారని వివరించారు. అక్కడితో ఆగకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటులోని రెండు సభల సభ్యులు మాత్రమే ఓటు వేస్తారని.. రాష్ట్ర శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉండదని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ప్రస్తుత పార్లమెంటు కూర్పును బట్టి చూస్తే.. అధికార పార్టీకి మెజారిటీ ఉండటం వల్ల వారి అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ఆయన విశ్లేషించారు.
అదే సమయంలో థరూర్ తన సమాధానంలో ప్రతిపక్షాల పాత్రను కూడా ప్రస్తావించారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపుతుందని తాము ఆశిస్తున్నట్లు వివరించారు. కానీ ఈ విషయాన్ని నేరుగా వారికి ఎవరు చెప్పగలరంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి కీలక పదవుల ఎంపికలో అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిదని ఆయన నొక్కిచెప్పారు. దీంతో దేశ రాజకీయాల్లో పెద్ద చర్చే మొదలైంది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి బీజేపీ ఆయనకు చెప్పాలని భావిస్తున్నారేమో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా పని చేసిన జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఆగస్టు 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21గా తెలిపారు. అలాగే నామినేషన్ల పరిశీలన తర్వాత అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఆగస్టు 24వ తేదీ వరకు గడువు ఉంటుందని వివరించారు. ఇక సెప్టెంబర్ 9న పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉండనున్నాయి. అదే రోజు అంటే ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa