అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉండేవారిని వారి స్వస్థలాకు పంపించిన ఆయన కఠిన నియమ నిబంధనలు తీసుకు వస్తున్నారు. అయితే తాజాగా అమెరికాలో అక్రమంగా ఉండేవారిని (వీసా ఓవర్‌స్టే) నియంత్రించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీ1, బీ2 వీసా దరఖాస్తుదారుల కోసం కొత్తగా 12 నెలల పాటు అమలు చేయనున్న వీసా బాండ్ పైలట్ కార్యక్రమాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రారంభించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి వచ్చే పర్యాటకులు, వ్యాపార వీసాదారులకు 15,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.13 లక్షలు) వరకు బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు అమెరికా నుంచి గడువులోగా తిరిగి వెళ్లినట్లయితే ఈ బాండ్ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లిస్తారు.
ఈ కొత్త పైలట్ కార్యక్రమం ఆగస్టు 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండిపోయే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం పౌరులు అమెరికాలో అక్రమంగా ఉండటానికి ప్రయత్నించకుండా నిరోధించగలదని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఏ దేశాలకు ఈ నిబంధన వర్తిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండిపోయే వారి శాతం ఎక్కువగా ఉన్న దేశాలకు ఈ నిబంధనలు వర్తించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ బాండ్ విధానం వల్ల అమెరికాకు ప్రయాణించాలనుకునే వారికి ఆర్థికంగా పెద్ద భారం పడనుంది. పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసేవారు కూడా 15,000 డాలర్ల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చాలా మందికి అందుబాటులో లేకపోవచ్చు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు, విద్యార్థులకు, చిన్న వ్యాపారవేత్తలకు ఇది ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారనుంది. ఈ నిర్ణయం వీసా దరఖాస్తు ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చడంతో పాటు అమెరికా పట్ల అంతర్జాతీయ పర్యాటకులలో ఉన్న ఆకర్షణను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయప డుతున్నారు.
ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలు, వీసా నిబంధనలను కఠినతరం తేశారు. ఈ తాజా నిర్ణయం కూడా అదే విధానంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ విధానంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ ప్రయాణాలకు ఆటంకం కలిగించడమే కాకుండా, విదేశాల నుంచి అమెరికాకు వచ్చే టాలెంట్, పెట్టుబడులను కూడా ప్రభావితం చేస్తుందని కొందరు వాదిస్తున్నారు. ఈ పైలట్ కార్యక్రమం 12 నెలల పాటు అమలులో ఉంటుంది. దాని ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో శాశ్వత విధానాన్ని రూపొందించాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa