మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తాజాగా ప్రారంభించిన ‘స్త్రీశక్తి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం వారి ఆర్థిక స్వావలంబనకు మరింత దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో కలిసి ఆయన స్త్రీశక్తి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులకు నెలకు సగటున రూ.1500 వరకు ఆదా అవుతుందని, ఇది వారి కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "2019లో అధికారంలోకి వచ్చిన ఒక రాక్షసుడు, సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చి, మహిళల మెడలోని తాళిబొట్లు తెంచాడు. విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని అమ్మి ఎన్నో కుటుంబాలను నాశనం చేశాడు" అని ఆయన ఆరోపించారు. తాను యువగళం పాదయాత్రలో మహిళల కష్టాలను కళ్లారా చూశానని, వారి ఇబ్బందులను దూరం చేయాలనే ఉద్దేశంతోనే సూపర్-6 పథకాలను రూపొందించాలని చంద్రబాబు గారిని కోరినట్లు తెలిపారు. గతంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే ఒకరినే బడికి పంపే దుస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తున్నామని, దీని ద్వారా 67 లక్షల మందికి పైగా తల్లులకు రూ.10 వేల కోట్లు అందజేశామని వివరించారు.కొందరు నేతలు మహిళా సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు. సొంత ఇంట్లో ఉన్న మహిళలను గౌరవించని వాళ్లు కూడా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. "సొంత చెల్లెలు రాఖీ కట్టని అన్నలు, సొంత తల్లి, చెల్లి నమ్మని వ్యక్తులు మాపై విమర్శలు చేస్తున్నారు. వారికి నేను చెప్పేది ఒక్కటే, ముందు మీ ఇంట్లో ఉన్న మహిళలను గౌరవించడం నేర్చుకోండి" అని ఆయన హితవు పలికారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వ కొనసాగింపు అత్యంత అవసరమని, 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం మారడం వల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో ప్రజలందరూ చూశారని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ సుపరిపాలనకు తొలి అడుగు వేసిందని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళలకు పెద్దపీట వేసిందని లోకేశ్ గుర్తుచేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారని, పద్మావతి మహిళా యూనివర్సిటీని స్థాపించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించారని, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని కొనియాడారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారనడానికి తన కుటుంబంలోని మహిళలే నిదర్శనమని లోకేశ్ అన్నారు. తన తల్లి భువనేశ్వరి హెరిటేజ్ సంస్థను, తన భార్య బ్రాహ్మణి ఎన్టీఆర్ ట్రస్ట్‌ను సమర్థవంతంగా నడిపిస్తున్నారని ఉదాహరించారు.మహిళల భద్రత కేవలం చట్టాలతోనే సాధ్యం కాదని, సమాజంలో నైతిక విలువలు, ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే వారికి నిజమైన రక్షణ లభిస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. "కొంతమంది ‘చేతికి గాజులు వేసుకున్నావా ‘అమ్మాయిలా ఏడవకు’ వంటి మాటలతో మహిళలను కించపరుస్తుంటారు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి" అని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలలో నైతిక విలువలు పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa