ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీల అమలులో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిష్టాత్మక 'స్త్రీ శక్తి' పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ఆయన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోట్లాది మహిళల దైనందిన జీవితంలో ఆర్థిక భారాన్ని తగ్గించి, వారి సాధికారతకు బాటలు వేయడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎవరూ నమ్మలేదు, కానీ ఈ రోజు అవే సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా మా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గత ఐదేళ్ల పాలనలో ప్రజలు సంతోషాన్ని, నవ్వును మరిచిపోయారు. ఆడబిడ్డలకు మహర్దశ కల్పించేంత వరకు వారికి అండగా ఉంటాం. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతృప్తిని ఇస్తోంది" అని అన్నారు.మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. "గతంలో డ్వాక్రా, మెప్మా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు పునాదులు వేశాం. ఆర్టీసీలో తొలిసారిగా మహిళలను కండక్టర్లుగా నియమించిన ఘనత కూడా మాదే. త్వరలోనే మన ఆడబిడ్డలు ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా సేవలు అందించాలి. మనసుంటే మార్గం ఉంటుందని మేము నిరూపించాంప" అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని, రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ పథకం రాష్ట్రంలోని సుమారు 2.62 కోట్ల మంది మహిళలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చనుంది. శుక్రవారం సాయంత్రం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఇకపై మహిళలు విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆధ్యాత్మిక యాత్రలు వంటి ఏ అవసరం కోసమైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయంలో మహిళలకు కండక్టర్లు 'జీరో ఫేర్ టికెట్' జారీ చేస్తారు. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు సగటున రూ.4 వేల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.ముఖ్యంగా, రోజూ పనుల కోసం పట్టణాలకు వెళ్లే కూలీలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగినులకు ఈ పథకం పెద్ద ఊరటనిస్తుంది. ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య చదివే విద్యార్థినులు ఇకపై బస్ పాస్‌ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే, తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, విజయవాడ కనకదుర్గమ్మ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే మహిళా భక్తులకు ప్రయాణ ఖర్చులు పూర్తిగా ఆదా అవుతాయి.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎంపీ కేశినేని చిన్ని, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa