ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సీఎం లేదా పీఎం తొలగింపు బిల్లు’పై విపక్షాలు అభ్యంతరం

national |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 05:10 PM

తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరసగా నెల రోజులపాటు జైలుల్లో ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రి లేదా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓడించలేక ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది క్రూరమైన, రాజ్యాంగ విరుద్దమైనందని విపక్ష ఎంపీలు విమర్శిస్తున్నారు. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ దేశాన్ని ‘పోలీస్ రాజ్యంగా... నియంతృత్వం’గా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఓటర్లను హెచ్చరించారు.


ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఫిరాయింపులకు ప్రోత్సహించడం లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేసులు పెట్టించి భయపెట్టడం ద్వారా ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరుస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. అటువంటి వ్యూహాలను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ప్రతిపక్షం వాదిస్తోంది.


కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ దీనిపై స్పందిస్తూ.. ‘‘నేను దీనిని పూర్తిగా క్రూరమైన విషయంగా చూస్తున్నాను... దీనిని ‘అవినీతి నిరోధక చర్య’ అని పిలవడం అంటే ప్రజల కళ్లకు గంతలు కట్టడమే.. రేపు మీరు ఒక ముఖ్యమంత్రిపై ఏదైనా కేసు నమోదు చేయవచ్చు, దోషిగా నిర్ధారణ కాకుండా అరెస్ట్ చేసి 30 రోజుల పాటు జైల్లో ఉంచితే అతడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.. అప్రజాస్వామికం’’ అని పేర్కొన్నారు.


‘‘విపక్షాలను అస్థిరపరచడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే ప్రతిపక్ష ముఖ్యమంత్రులను అరెస్టు చేయడానికి కేంద్ర సంస్థలను ఉపయోగించడం.. ఆపై, ఎన్నికల్లో వారిని ఓడించలేకపోయినా ఏకపక్ష అరెస్టుల ద్వారా వారిని తొలగించడం.. అధికార బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు ఎవ్వర్నీ టచ్ చేయరు’’ అని మరో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ విమర్శించారు. ఇందుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఉదాహరణగా చూపారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి, ఎటువంటి విచారణ లేకుండానే ఐదు నెలల పాటు జైల్లో ఉంచారని గుర్తుచేస్తున్నారు.


ఈ ప్రతిపాదిత బిల్లు అప్పటికి అమలులో ఉండి ఉంటే కేజ్రీవాల్ అరెస్టైన 2024 మార్చి 21 నుంచి 31వ రోజున ఆయనను పదవి నుంచి తొలగించేవారని ఆరోపిస్తున్నారు. అప్పట్లో కేజ్రీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే, చివరకు జైలు నుంచి విడుదలైన అనంతరం సెప్టెంబర్ 17న రాజీనామా చేశారు. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ కూడా ఇలాంటిదే. మనీల్యాండరింగ్ కేసులో అరెస్టైన సెంథిల్ బాలాజీని కూడా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోర్ట్‌ఫోలియే లేకుండానే తన మంత్రివర్గంలో కొనసాగించారు. దీనిపై గవర్నర్ ఆర్‌ఎన్ రవితో వివాదం చెలరేగింది. సుప్రీంకోర్టుకు కూడా ఈ అంశం చేరగా... చివరికి ఆయన కూడా రాజీనామా చేశారు.


తృణమూల కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్‌ గోఖలే ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ.. ఓట్లో చోరీ వ్యవహారం బయటపడినప్పటి నుంచి మోదీ-షాలు కొత్త ట్రిక్కులు వెదుకుతున్నారు.. ప్రస్తుతం తీసుకొస్తున్న బిల్లు విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నేరుగా కూల్చే అవకాశం కేంద్ర దర్యాప్తు సంస్థలకు కట్టబెడుతుంది.. నేరారోపణలు ఎదుర్కొనే వ్యక్తి కోర్టు తీర్పు వచ్చాకే దోషిగా నిర్ధరణ అవుతుంది. అప్పటివరకు నిందితులు మాత్రమే.. కేవలం ఆరోపణలతోనే సీఎంలు, మంత్రులను తొలగించలేరు. మోదీ-షా ద్వయం సీబీఐ, ఈడీలతో అరెస్టు చేయించినా వారు నేరస్థులు కాబోరు’’ అని పేర్కొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa