కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. 3 కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వీటిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మరీ ముఖ్యంగా సీఎంలు గానీ, పీఎం గానీ ఏదైనా కేసులో అరెస్ట్ అయి 30 రోజుల కంటే ఎక్కువ రోజులు జైలులో ఉంటే.. వారిని పదవి నుంచి తొలగించేలా తీసుకువచ్చిన బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేక గళం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో ఉదయం నుంచి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలు, విమర్శలు, గందరగోళం మధ్యే.. 3 బిల్లులను కేంద్రమంత్రి అమిత్ షా.. లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ 3 బిల్లులను.. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఈ 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025 , జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025 , కేంద్ర పాలిత ప్రాంతాల (సవరణ) బిల్లు 2025 వంటి 3 కీలక బిల్లులను బుధవారం.. కేంద్రమంత్రి అమిత్ షా.. లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఇందులో రాజకీయ నేతలకు సంబంధించిన నేరాలపై కీలక బిల్లులను ప్రవేశ పెట్టారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు ఎవరైనా తీవ్రమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ.. 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దు అయ్యేలా సరికొత్త బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.
ఈ బిల్లును విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే.. రాజకీయ దుర్వినియోగానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు దేశ సమాఖ్య విధానానికి విరుద్ధమని ఎంపీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా లోక్‌సభలో కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో గుజరాత్ హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఉన్నప్పుడు.. ఆయన అరెస్ట్ అయ్యారని కేసీ వేణుగోపాల్ పేర్కొనగా.. తాను దానికి నైతిక బాధ్యత వహించి.. మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే పలువురు ఎంపీలు సభలో నినాదాలు చేయడంతో గందరగోళం తలెత్తింది. ఇక ఈ 3 బిల్లులను వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్ష ఎంపీలు వాటికి సంబంధించిన పేపర్లను చింపి.. అమిత్ షా వైపు విసిరికొట్టడంతో సభలో తీవ్ర రసాభాస ఏర్పడింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. సభను పలుమార్లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులు సభలో హుందాగా, మర్యాదపూర్వకంగా మెలగాలని స్పీకర్ సూచించారు.
ఇక ఈ 3 బిల్లులను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు. ఈ బిల్లులు అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని తెలిపారు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల హక్కును కూడా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఆరోపణలు, అనుమానాల ఆధారంగా.. కేంద్ర, రాష్ట్ర అధికార సంస్థలకు అపరిమిత అధికారాలను కల్పిస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పోలీసు రాజ్యాన్ని సృష్టించాలని నిర్ణయించుకుందని.. ఎన్నికైన ప్రభుత్వాలకు ఇది ఒక మరణశాసనం అని పేర్కొన్నారు. దేశాన్ని పోలీస్ రాజ్యంగా మార్చేందుకు భారత రాజ్యాంగాన్ని సవరిస్తున్నారని.. ఇది అమల్లోకి వస్తే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు జవాబుదారీగా ఉండరని ఒవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa