ట్రెండింగ్
Epaper    English    தமிழ்

320 కి.మీ. వేగంతో నడిచే భారత్ సరికొత్త బుల్లెట్ రైలు గురించి తెలుసా

national |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 08:03 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధానితో చర్చల అజెండాలో ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌ కూడా ఉంది. అధునాతన రైళ్లను నడపడానికి జపాన్‌లో శిక్షణ పొందుతున్న భారతీయ డ్రైవర్లను మోదీ కలిసే అవకాశం ఉంది. ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ పనులకు 2017లో శంకుస్థాపన జరిగింది. గుజరాత్‌లోని శబర్మతిలో జరిగిన భూమి పూజలో నరేంద్ర మోదీ, నాటి జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే పాల్గొన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభానికి ముందు నాలుగేళ్ల పాటు భారతీయ రైల్వేలు, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) అధ్యయనాలు సాగించాయి. రెండేళ్ల అనంతరం అవగాహన ఒప్పందం సంతకం చేశాయి. మొత్తం రూ. 1.08 లక్షల కోట్ల ప్రాజెక్ట్ వ్యయంలో 80 శాతం నిధులు జపాన్ అందజేయడానికి ముందుకొచ్చింది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.


 అయితే, ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు నిర్మాణ పనులు మొదట నెమ్మదిగా సాగినా.. ప్రస్తుతం వేగం పుంజుకుంది. 2027 నాటికి మొదటి భాగం గుజరాత్‌లో ప్రారంభించి, మొత్తం 508 కిలోమీటర్ల మార్గం 2028 నాటికి పూర్తిగా కార్యకలాపాలకు సిద్ధమవుతుందని అంచనా. ఈ ప్రయాణానికి కేవలం 2.07 గంటలే పడుతుందని చెబుతున్నారు. కాగా, ప్రధాని మోదీ, జపాన్ ప్రస్తుత ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా కూడా భారత్‌లో మరిన్ని బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 2009లోనే పుణే-అహ్మదాబాద్, ఢిల్లీ-అమృత్‌సర్ వంటి ఐదు హై-స్పీడ్ రైలు కారిడార్లు ఖరారయ్యాయి.


ఏంటీ బుల్లెట్ రైలు?


ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న హై-స్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌ల మాదిరిగానే ఉంటుంది. చైనా, దక్షిణ కొరియా, టర్కీ, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశాల్లోనూ ఈ వ్యవస్థ ఉంది. బుల్లెట్ రైలు 250 కి.మీ. వేగానికి పైగా నడవాలి మరియు ప్రత్యేకంగా కేటాయించిన పట్టాలపై మాత్రమే పరిగెత్తాలి.


E10 షింకాన్సెన్ సిరీస్


ప్రణాళిక ప్రకారం జపాన్ నుంచి E5 షింకాన్సెన్ సిరీస్‌ను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. కానీ, ప్రాజెక్ట్‌‌లో జాప్యం కావడం, జపాన్ సాంకేతికంగా పురోగతి సాధించడంతో కొత్తతరం E10 సిరీస్ ఆఫర్ చేసింది. దీని డిజైన్ ‘సకురా’ (చెర్రీ బ్లాసమ్ పువ్వులు) ప్రేరణతో రూపొందించారు.


ఈ రైలు భూకంపాలను తట్టుకుంటుంది. దీని 'L’ ఆకారపు వాహన గైడ్స్' వల్ల భూకంప సమయంలో పట్టాలు తప్పకుండా నిరోధిస్తాయి. లాటరల్ డ్యాంపర్లు కంపనాలను నిరోధించి, నష్టం తగ్గించి పట్టాలు తప్పకుండా అడ్డుకట్ట వేస్తాయి. E5తో పోలిస్తే లగేజీకి ఎక్కువ చోటు, వీల్‌చైర్ ప్రయాణికుల కోసం ప్రత్యేక సీట్లు, అలాగే ప్రయాణికులు/ సరుకు అవసరాన్ని బట్టి మార్చుకోగలిగే ఫ్లెక్సిబుల్ సీటింగ్ ప్లాన్ ఉంటాయి.


వేగం, సాంకేతికత


ఈ5 మాదిరిగా దీని గరిష్ఠ వేగం గంటకు 320 కిలోమీటర్లు. కానీ, ఎలక్ట్రానిక్ పరిమితి ఉంది. ఎక్కడా ఆగకుండా 360 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులోని అత్యాధునిక బ్రేకింగ్ వ్యవస్థ అధిక వేగాన్ని కేవలం 3.4 కి.మీ. దూరంలోనే 15 శాతానికి నియంత్రించగలదు. జనసాంద్రత అధికంగా ఉన్న భారతీయ రైలు మార్గాలకు చాలా కీలకం. కొత్త ఇంజిన్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.


భవిష్యత్తులో ఆటోమేటిక్ ఆపరేషన్ సపోర్ట్ చేసే సామర్థ్యం ఉంటుంది (అయితే, దేశంలో రైలు ప్రమాదాలు తరుచూ జరుగుతుండటం ఇది ఒక ఆందోళన కలిగించే అంశం). ఇక, ప్రస్తుతం జపాన్‌లో ఈ 5, ఈ2 ఉండగా 2030 నాటికి E10 అందుబాటులోకి వస్తుంది. అప్పటిలోగా భారత్‌కు ఒక E5, E3 సెట్లను జపాన్ అందజేస్తుంది. 2027లో ముంబయి- అహ్మదాబాద్ మార్గంలో E5 షింకాన్సెన్ నడుస్తుంది.


సౌకర్యాలు


E5తో పోలిస్తే E10లో విస్తృతమైన సౌకర్యాలు ఉంటాయి. లెదర్ రిక్లైనర్ సీట్లతో కూడిన ప్రత్యేక బిజినెస్ క్లాస్, బిల్ట్-ఇన్ డెస్క్‌లు, వై-ఫై ఉంటాయి.


గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు.. ఖర్చు తక్కువ, స్పీడు ఎక్కువ!


మేకిన్ ఇండియాకు రండి


జపాన్ పర్యటనలో ఆ దేశ వ్యాపారవేత్తలను భారత్‌కి మోదీ ఆహ్వానిస్తూ.. ‘సెమీకండక్టర్లు నుంచి స్టార్టప్‌ల వరకు జపాన్ ఎల్లప్పుడూ కీలక భాగస్వామి. జపాన్ సంస్థలు కంపెనీలు భారత్‌లో 40 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాయి’ అన్నారు. నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం.. వచ్చే పదేళ్లలో భారత్‌తో వ్యాపారాన్ని పెంచడానికి 10 ట్రిలియన్ యెన్ (68 బిలియన్ డాలర్లు)లు జపాన్ పెట్టుబడి పెట్టనుంది. ఇందులో కృత్రిమ మేధ, సెమీ-కండక్టర్లు, పర్యావరణం, వైద్యరంగం వంటి పలు రంగాలు ఉంటాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa