ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెలవు రోజుల్లోనూ పని చేసినందుకు పనిమనిషికి షాక్.. ఏకంగా రూ.8.8 లక్షల జరిమానా విధింపు

international |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 09:49 PM

సాధారణంగా ఇళ్లల్లో పని చేసేందుకు వచ్చే వారంతా ఓ రెండు, మూడు చోట్ల పని చేస్తూ ఉంటారు. ఇక్కడ అయిపోగానే మరో చోటుకు వెళ్లి అక్కడ కూడా వంట చేయడం, ఇళ్లు తుడవడం, అంట్లు కడగడం, బట్టలు ఉతకడం వంటివి చేస్తుంటారు. ఇలా ఓ నాలుగైదు ఇళ్లల్లో పని చేసుకుంటేనే వారికి కూడా డబ్బులు మిగులుతుంటాయి. ఇక ఏవైనా సెలవు రోజులు, పండుగ దినాల్లోనూ పని చేయాలంటే కాస్త ఎక్కువగానే డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. మనం కూడా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందిస్తుంటాం. ఇలా రోజూ కష్టపడే అనేక మందిని మనం ఇప్పటి వరకు చాలానే చూశాం. ఏరోజూ ఖాళీగా ఉండకుండా నిత్యం పని చేస్తూ.. కష్టం చేసుకునే వారికి మనం కూడా అండగానే నిలుస్తుంటాం.


కానీ అచ్చంగా ఇలాగే పని చేసుకునే ఓ మహిళకు మాత్రం సింగపూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. సెలవు రోజుల్లోనూ ఆమె పని చేసిందని గుర్తించి జరిమానా విధించింది. ముఖ్యంగా ఒకరి వద్ద కాకుండా మరో ఇద్దరి వద్ద పని చేయడాన్ని కూడా న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ కారణాల వల్లే సదరు పని మనిషికి రూ.8.8 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆమెకు పని ఇచ్చిన ఓ మహిళకు కూడా రూ.6.13 లక్షల జరిమానా వేసింది. మరి న్యాయస్థానం ఇంతటి చర్యలు తీసుకోవడానికి గల కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


సింగపూర్ ప్రభుత్వం విదేశీ మానవ వనరుల చట్టం ను కఠినంగా అమలు చేస్తుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఒక విశ్వసనీయ సమాచారం అందడంతో.. సింగపూర్‌లోని కార్మిక శాఖ 2024 డిసెంబర్ నుంచి ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. ఈ కేసులో నిందితురాలు 53 ఏళ్ల పిడో ఎర్లిండా ఒకాంపో గత మూడు దశాబ్దాలుగా సింగపూర్‌లో చట్టబద్ధంగా పని చేస్తున్నారు. 1994 నుంచి ఆమె నలుగురు అధికారిక యజమానుల దగ్గర పనిచేస్తూ వచ్చారు. అయితే ఆమె తన ఖాళీ సమయాల్లోనూ మరిన్ని ఇళ్లల్లో పని చేయడం ప్రారంభించారు.


ఆమె అక్రమంగా పని చేసిన ఇద్దరు యజమానుల్లో 64 ఏళ్ల సో ఓయ్ బెక్ కూడా ఒకరు. దాదాపు నాలుగేళ్ల పాటు ఎర్లిండా.. సో ఓయ్ బెక్ ఇంట్లో అనధికారికంగా పని చేశారు. 2018 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఆమె ప్రతి నెల రెండు లేదా మూడు సార్లు వెళ్లి.. మూడు నుంచి నాలుగు గంటల పాటు సో ఇంటిని శుభ్రం చేసేవారు. ఈ పనులకు ఆమెకు ప్రతి నెలా సుమారు 375 సింగపూర్ డాలర్లు నగదు రూపంలో చెల్లింపులు అందాయి. అయితే 2020లో కొవిడ్-19 ఆంక్షల కారణంగా ఈ పని తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆంక్షలు సడలించాక.. 2022 మార్చి నుంచి 2024 సెప్టెంబర్ వరకు తిరిగి పనులు ప్రారంభించారు.


ఎర్లిండా వేరే చోట పని చేస్తున్న విషయం తెలిసినా.. సో ఆమెను నియమించుకున్నారు. ఈక్రమంలోనే సో ఓయ్ బెక్ కోర్టులో మాట్లాడుతూ.. తాను చాలా బిజీగా ఉండటం వల్ల, తన ఇంటిని శుభ్రం చేయడానికి నమ్మకమైన సహాయకురాలు అవసరమైందని చెప్పారు. ఈక్రమంలోనే పులక్ ప్రసాద్ అనే వ్యక్తి తనకు ఎర్లిండాను పరిచయం చేసినట్లు వివరించారు. 2019 సెప్టెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు, ఆ తర్వాత 2022 మార్చి నుంచి 2024 సెప్టెంబర్ వరకు ఎర్లిండా ప్రసాద్ ఇంట్లో పని చేశారు. ప్రసాద్‌కి అవసరమైనప్పుడు నెలకు ఒకటి లేదా రెండు సార్లు వెళ్లి శుభ్రం చేసి, దాదాపు 450 సింగపూర్ డాలర్లు అందుకున్నారు. ఈయన సూచించడం వల్లే ఎర్లిండాను తాను పనిలో పెట్టుకున్నట్లు సో ఓయ్ బెక్ వెల్లడించారు.


సింగపూర్ చట్టం ప్రకారం విదేశీ గృహ సహాయకులు తమ అధికారిక యజమానుల వద్ద మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతారు. సెలవు రోజుల్లో కూడా వేరే పనులు చేయడం నిషేధం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన విదేశీ కార్మికులకు 20 వేల సింగపూర్ డాలర్ల వరకు జరిమానా ఉంటుంది. అలాగే రెండేళ్ల జైలు శిక్ష.. లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అలాగే అక్రమంగా ఒక విదేశీ కార్మికుడిని నియమించుకున్నయజమానులకు 5,000 నుంచి 30,000 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా లేదా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, లేదా రెండూ విధించవచ్చు.


అయితే ఎర్లిండా అనధికారికంగానూ రెండు ఇళ్లల్లో, సెలవు రోజుల్లోనూ పని చేసినందుకు 13,000 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.8.8 లక్షలు) జరిమానా విధించారు. అలాగే ఎర్లిండా వేరే చోట పని చేస్తున్నట్లు తెలిసినా పనిలో పెట్టుకున్నందుకు గాను సో ఓయ్ బెక్‌కు 7,000 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.6.13 లక్షలు) ఫైన్ వేసింది. న్యాయస్థానం తీర్పుతో నిందితులు ఇద్దరూ ఓ జరిమానాను చెల్లించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa