ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలుషిత నీటిని వాడటం వలనే ఆ మరణాలు సంభవించాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 01:54 PM

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి ఆదేశాల మేర‌కు గుంటూరు జిల్లా, తుర‌క‌పాలెంలో జ‌రుగుతున్న అకాల మ‌ర‌ణాల‌కు గ‌ల కార‌ణాల గురించి అన్వేషించ‌డానికి వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్ల బృందం గురువారం గ్రామంలో ప‌ర్య‌టించ‌డంతో పాటు మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డం జ‌రిగింది అని  ప‌ల్నాడు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీనివాస‌ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా అయన మాట్లాడుతూ.... గ్రామమంతా తిరిగి పారిశుద్ధ్యం, నీటి స‌ర‌ఫ‌రా, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల గురించి ఆరాతీశాం. చ‌నిపోయిన వారంతా జ్వ‌రంతో ప్రారంభ‌మై అక‌స్మాత్తుగా తీవ్రంగా అనారోగ్యంపాలై ఆయాసంతో, మ‌ల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నారు. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో గ్రామంలో 40 మందికి పైగా యువ‌త‌, న‌డి వ‌య‌సు వారు చ‌నిపోయారు. కలుషిత‌మైన నీరు, మ‌ట్టిలో నుంచి వ‌చ్చే బ్యాక్టీరియా ద్వారా మెలిడియోసిస్ అనే వ్యాధి సోకి జ్వ‌రంతో మొద‌లై కీళ్లు, కండ‌రాల నొప్పులు, తీవ్ర‌మైన ఆయాసంతో బాధ‌ప‌డుతూ వారం ప‌దిరోజుల వ్య‌వ‌ధిలోనే మ‌ర‌ణాలు సంభవిస్తున్నాయి. గ‌తంలో ఎప్పుడూ ఇలా నీటిని త‌ర‌లించ‌డం జ‌ర‌గ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌నే నీరు స‌రిపోక గ‌త మూడు నెల‌లుగా ఈ క్వారీ గుంత‌ల్లో నీటిని గృహ అవ‌స‌రాల కోసం స‌ర‌ఫ‌రా చేస్తున్నారని గ్రామ‌స్తులే చెబుతున్నారు. గుంటూరు న‌గ‌రానికి కూత వేటు దూరంలోనే ఉన్న ఈ గ్రామం నుంచే రోజుకు 45 ల‌క్ష‌ల లీట‌ర్ల నీటిని బోర్లతో తోడి ట్యాంక‌ర్ల ద్వారా త‌ర‌లిస్తున్నా, గ్రామ‌స్తుల‌కు మాత్రం క్వారీ గుంత‌ల్లో కలుషిత‌మైన నీటిని ఓవ‌ర్ హెడ్ ట్యాంకు ద్వారా ఇంటింటికీ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఆ నీటిని త‌ర‌లిస్తున్న గుంత‌లో కప్పలు తిరుగుతున్నాయి. గుంట నుంచి దారుణంగా దుర్వాస‌న వ‌స్తోంది. ఆ నీటిని ఎలా త‌ర‌లిస్తున్నారో అర్థం కావ‌డం లేదు. తుర‌క‌పాలెం గ్రామంలో జ‌రిగిన మ‌ర‌ణాల‌కు  వైద్యారోగ్య‌శాఖ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే కార‌ణం. వైద్యారోగ్య‌శాఖ మంత్రి, వైద్యాధికారులు, ఇత‌ర ప్ర‌భుత్వ అధికారులెవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఈ స‌మ‌స్య మీద నెల రోజుల క్రిత‌మే బ‌ త‌ర‌ఫున జిల్లా క‌లెక్ట‌ర్‌కి ఫిర్యాదు చేసినా వారు కూడా ప‌ట్టించుకోలేదు. గ్రామ‌స్తులంతా మిన‌ర‌ల్ వాట‌ర్ కొని తాగుతున్నారు. కేవ‌లం గృహ అవ‌స‌రాల‌కు మాత్ర‌మే ఓవ‌ర్ హెడ్ ట్యాంకు నుంచి స‌ర‌ఫరా చేసే నీటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్ప‌టికైనా ఓవ‌ర్‌ హెడ్ ట్యాంకులో ఉన్న నీటిని ఖాళీ చేయించి దానికి స‌ర‌ఫ‌రా నిలిపివేయాలి. గుంటూరు జీజీహెచ్‌లో ప్ర‌త్యేక‌మైన వార్డును ఏర్పాటు చేసి ప్ర‌త్యేక వైద్య బృందాన్ని కేటాయించాలి. మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం న‌ష్ట పరిహారం చెల్లించాలి. మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏంటంటే గ్రామంలో మంచినీరు దొర‌క్క‌పోయినా ఐదు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన మ‌ద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఒక‌ప‌క్క ఇలాంటి దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొని ఉంటే వైయ‌స్ జ‌గ‌న్ నిర్మించిన ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేయాల‌ని నిర్ణ‌యించ‌డం దారుణమని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa