ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి కారుకు ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు.. 50 శాతం డిస్కౌంట్‌తో చెల్లింపు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 09:51 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం ఉపయోగించే టయోటా ఇన్నోవా కారుపై ఏకంగా ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు అయ్యాయి. అందులో ఆరు సార్లు సీఎం సీటు బెల్టు ధరించలేదు. అలాగే ఓసారి కారు మితిమీరిన వేగంతో వెళ్లింది. ఇలా మొత్తంగా ఏడు ఉల్లంఘనలకు గాను రూ. 5000 జరిమానా విధించగా.. దాన్ని ట్రాఫిక్ ఫైన్ల డిస్కౌంట్ పథకం కింద చెచల్లించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ట్రాఫిక్ నిబంధనల అమలు, పారదర్శకతపై చర్చకు తెరతీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక వాహనానికి ఏడు చలాన్లు పడడం.. అవి కూడా సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో ఉండడం గమనార్హంగా మారింది.


ఈ ఉల్లంఘనలు గతేడాది మార్చి నుంచి 2025 ఆగస్టు నెలల మధ్య జరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు ధృవీకరించారు. మొత్తంగా ఏడు సార్లు ఉల్లంఘనలు జరగ్గా అందులో సీటు బెల్టు ధరించనందుకు ఆరు సార్లు, అతి వేగానికి సంబంధించిన ఒకసారి చలానా పడింది. ఇలా సీఎం కారుకు జరిమానా ఉన్నా చెల్లించకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ముఖ్యంగా ఓ సామాన్య పౌరుడు సీఎం కారు నెంబర్ (KA 09 G 5555) తెలుసుకుని ఆన్‌లైన్‌లో చెక్ చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏడు చలాన్లు ఉండడం చూసిన ఇతడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా చర్చ ప్రారంభం అయింది.


ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు ఊరట కల్పిస్తూ.. 50 శాతం డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించింది. దీంతో సీఎం యంత్రాంగం డిస్కౌంట్ పథకాన్ని ఉపయోగించుకుని 50 శాతం రాయితీతో జరిమానాలను చెల్లించింది. రూ.5000 జరిమానా పడగా.. రూ.2500 చెల్లించారు. ఈ మొత్తం ఆగస్టు 21న చెల్లించినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల వెబ్‌సైట్‌లో వివరాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే డిస్కౌంట్ పథకం వాడుకోవడంతో నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక వాహనం అయినప్పటికీ.. సాధారణ ప్రజల మాదిరిగానే చట్టప్రకారం జరిమానా విధించడం ట్రాఫిక్ పోలీసుల పారదర్శకతకు నిదర్శనమని కొంతమంది నెటిజన్లు ప్రశంసించారు.


ఈ సంఘటనపై రాజకీయ నాయకులు, ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు 'చట్టం అందరికీ సమానమే' అని పేర్కొంటూ పోలీసుల చర్యను స్వాగతించగా.. మరికొందరు వీఐపీలు కూడా ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన ట్రాఫిక్ నిబంధనల పట్ల అప్రమత్తత అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa