మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన డి.డి. లపాంగ్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో గత కొంత కాలంగా బాధ పడుతున్న ఆయన.. షిల్లాంగ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో మేఘాలయ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లైంది. రాష్ట్ర అభివృద్ధికి, రాజకీయ స్థిరత్వానికి ఆయన చేసిన కృషి అపారమైనది కాగా.. ప్రజలంతా ఆయన మృతితో శోకసంద్రంలో నిండిపోయారు.
1934 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన లపాంగ్.. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరిగా నిలిచారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం 1972లో ప్రారంభమైంది. అప్పట్లో నాంగ్పో అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. తొలిసారిగా మేఘాలయ శాసనసభలో అడుగు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రారంభించిన ఆయన ప్రస్థానం.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా గెలవడానికి ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనం. సుమారు రెండు దశాబ్దాల పాటు వివిధ శాఖలకు ఆయన మంత్రిగా కూడా పని చేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్ర పరిపాలన మరియు అభివృద్ధి అంశాలపై లోతైన అవగాహన పెంచుకున్నారు.
లపాంగ్‌కు నాలుగు సార్లు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత దక్కింది. 1992 నుంచి 2008 మధ్య కాలంలో ఆయన వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేఘాలయ సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సంక్షోభ సమయాల్లో కూడా ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించి, రాజకీయ స్థిరత్వానికి కృషి చేశారు.
రాష్ట్రప్రజల సంతాపం..
లపాంగ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజల సమస్యలపై స్పందించే వ్యక్తిగా.. రాష్ట్ర సంక్షేమానికి నిబద్ధత కలిగిన నేతగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ పార్టీల సరిహద్దులకు అతీతంగా ఆయన అందరి గౌరవాన్ని పొందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు తమ సంతాపం తెలియజేశారు. లపాంగ్ మృతి మేఘాలయ రాష్ట్రానికి, ముఖ్యంగా ఆయనను అభిమానించే ప్రజలకు తీరని లోటని చెప్పుకొచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూనే.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa